Wardhannapet : వర్థన్నపేట నియోజకవర్గంలో సీన్ రివర్స్, ఎమ్మెల్యే అరూరికి ఎదురుగాలి!-wardhannapet constituency mla aroori ramesh brs cadre youth against to mla ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Wardhannapet : వర్థన్నపేట నియోజకవర్గంలో సీన్ రివర్స్, ఎమ్మెల్యే అరూరికి ఎదురుగాలి!

Wardhannapet : వర్థన్నపేట నియోజకవర్గంలో సీన్ రివర్స్, ఎమ్మెల్యే అరూరికి ఎదురుగాలి!

HT Telugu Desk HT Telugu

Wardhannapet Constituency : వర్థన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు గెలుపు టెన్షన్ పట్టుకుంది. హ్యాట్రిక్ కొట్టి మంత్రి రేసులో ఉండాలని భావించిన అరూరికి నియోజకవర్గంలో సీన్ రివర్స్ అయింది.

ఎమ్మెల్యే అరూరి రమేశ్

Wardhannapet Constituency : రాష్ట్రంలో రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుపొందిన ఆ ఎమ్మెల్యే.. హ్యాట్రిక్​ కొట్టి మంత్రి పదవి రేసులో ఉండాలనుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రత్యర్థులెవరూ లేరనే ఉద్దేశంతో ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ నియోజకవర్గంలో సీన్​ రివర్స్​ అయ్యింది. ఎన్నికల వేళ ఆయన ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. లోకల్​ నాయకుల తీరు, జనాల తిరుగుబాటు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? ఆయనే వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్​.

రెండు సార్లు భారీ మెజారిటీ

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ కు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీశ్​ రావు తరువాత అత్యంత భారీ మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. 2014 ఎన్నికల్లో రమేశ్.. అప్పటి సిట్టింగ్​ఎమ్మెల్యే కాంగ్రెస్​ నుంచి బరిలో నిలిచిన కొండేటి శ్రీధర్​పై దాదాపు 86 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ జన సమితి నేత పగిడిపాటి దేవయ్య పై 99 వేలకు పైగా మెజారిటీ పొందారు. సుమారు లక్షా 20 వేల మెజారిటీ సాధించిన మంత్రి హరీశ్​ రావు తరువాత అత్యధిక ఓట్లు పొందిన ఎమ్మెల్యేగా అరూరి రమేశ్​కు పేరుంది. గత రెండు ఎన్నికలను బేరీజు వేసుకుని ఆయన 2023 ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించాలని టార్గెట్​ పెట్టుకున్నారు.

హ్యాట్రిక్​ కొడితే మంత్రి పదవి రేసులో

నియోజకవర్గంలో హ్యాట్రిక్​ విజయం సాధించాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్​ ఆరాటపడుతున్నారు. మూడోసారి ఘన విజయం సాధిస్తే.. మంత్రి పదవి రేసులో ఉండొచ్చని ఆశపడుతున్నారు. గత ఎన్నికల్లోనే భారీ మెజారిటీ రావడంతో ఆ సమయంలో మంత్రి పదవి ఆశించారు. కానీ పార్టీ వివిధ సమీకరణాల వల్ల ఆ కల నెరవేరలేదు. ఈసారి బంపర్​ మెజారిటీతో గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి డిమాండ్​ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అనుకున్న మెజారిటీ వస్తుందా లేదా అని సర్వేలు నిర్వహించి, పార్టీ నేతలు, కార్యకర్తలకు తరచూ దిశానిర్దేశం చేస్తున్నారు.

నియోజకవర్గంలో సీన్​ రివర్స్

ఎమ్మెల్యే అరూరి రమేశ్​ భారీ మెజారిటీ ఆశిస్తుండగా.. నియోజకవర్గంలో సీన్​ మొత్తం రివర్స్​ అయ్యింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, హసన్​పర్తి, హనుమకొండ మండలాలు ఉండగా.. అంతటా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రేటర్​ వరంగల్ సిటీ పరిధిలోనే వర్ధన్నపేటకు చెందిన దాదాపు 30 విలీన గ్రామాలు ఉండగా.. వాటి అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతోనే ఎన్నికల వేళ ఆయన ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ నిరసనలే ఎదురవుతున్నాయి. ఇటీవల ఐనవోలు మండల పర్యటనకు వెళ్లగా.. కొండపర్తి, వనమాల కనపర్తి, తదితర గ్రామాల ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, నల్లబెల్లి, హసన్​పర్తి మండలం పెంబర్తి, జయగిరి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

యూత్ ను ఆకర్షించేందుకు

తాజాగా సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు జయగిరి గ్రామానికి వెళ్లగా.. అక్కడి ప్రజలు ఎమ్మెల్యే గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పథకాలు పార్టీ నేతలకే పరమితం చేయడం, గ్రామాల్లో లీడర్ల వ్యవహారశైలితో చాలామంది యూత్​ పార్టీకి దూరం అవుతున్నారు. అభివృద్ధి కనిపించకపోవడం, ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేను నేరుగా కలవలేని పరిస్థితి నెలకొనడంతో యూత్​ చాలావరకు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఎమ్మెల్యే అరూరి రమేశ్​ టెన్షన్​లో పడినట్లు తెలుస్తోంది. దీంతోనే యూత్​ ను మచ్చిక చేసుకోవాలని, ఎలాగైనా యూత్​ను బీఆర్ఎస్​ వైపు మళ్లించాలని సూచించడంతో గ్రామాల్లో లీడర్లు యూత్​తో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

క్యాడర్​లోనూ అసంతృప్తి !

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ సెంటిమెంట్​తో అరూరి రమేశ్​కు భారీ మెజారిటీ రావడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేశారు. జనాలు కూడా రిసీవ్​ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమందిని మాత్రమే పట్టించుకుంటూ మిగతా క్యాడర్​ను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపునకు ముందు ఆయనపై అసమ్మతి రాజేసిన కొంతమంది బీఆర్ఎస్​ లీడర్లు.. అరూరికి టికెట్​ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు వినతిపత్రాలు ఇవ్వడం కూడా క్యాడర్​లో అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేకు అతిసన్నిహితులుగా చెప్పుకొనే ఓ పీఎసీఎస్​చైర్మన్​, ఓ మాజీ కార్పొరేటర్​, జిల్లాకు చెందిన మరో ముగ్గురు కీలక నేతలు అరూరిపై వ్యతిరేకతతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతోనే ఎమ్మెల్యే అరూరికి గెలుపు టెన్షన్​ పట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రామస్థాయిలో పట్టుండటంతో ఎమ్మెల్యే మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్​పై వ్యతిరేకత కనిపిస్తుండగా.. కాంగ్రెస్​, బీజేపీ కూడా పుంజుకున్నాయి. కాగా ఆ రెండు పార్టీల నుంచి బరిలో దిగే నేతలను ఎమ్మెల్యే అరూరి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

(రిపోర్టింగ్ :​హెచ్.టి తెలుగు, వరంగల్ ప్రతినిధి)