EC Fact Check on Nagababu Video : డబ్బు పంపిణీలో వేళ్లకు సిరా చుక్కా, నాగబాబు వీడియోపై ఈసీ ఫ్యాక్ట్ చెక్
12 May 2024, 16:04 IST
- EC Fact Check on Nagababu Video : ఏపీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పంపిణీలు షురూ అయ్యాయి. పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతూ ఓటర్ల వేళ్లపై సిరా చుక్క వేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ఈ వీడియోను ఈసీ ఫ్యాక్ట్ చెక్ చేసింది.
నాగబాబు వీడియోపై ఈసీ ఫ్యాక్ట్ చెక్
EC Fact Check on Nagababu Video : ఏపీలో ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని, డబ్బులు ఇచ్చిన గుర్తుగా ఓటర్లకు చెరగని సిరా ఇంకు వేస్తున్నారని జనసేన నేత నాగేంద్ర బాబు ఆరోపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వివాదంపై ఫ్యాక్ట్ చెక్ చేసిన ఎన్నికల సంఘం ఇందులో వాస్తవం లేదని తేల్చింది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేయకుండా ఓటర్లకు చెరగని ఇంకు వేస్తున్నారని వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వీడియో ద్వారా తప్పుడు సమాచారం వ్యాపించిందని ఎన్నికల సంఘం తేల్చింది.
తప్పుదారి పట్టించే సమాచారం
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఈ వీడియోపై విచారణ చేపట్టారు. తన వీడియో సందేశంలో ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులకు మాత్రమే చెరగని సిరా ఉపయోగించే అధికారం ఉందని, ఎవరైనా వేరే సిరాను ఉపయోగించాలని ప్రయత్నిస్తే పట్టుబడ్డారని ఈసీ తెలిపింది. ఒకవేళ ఎవరా ఓటర్లకు సిరా వేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించింది. కాబట్టి వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని సూచించింది. ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకునే ముందు ఎల్లప్పుడూ వాస్తవాన్ని గుర్తించాలన్నారు ఈసీ అధికారులు. ఏదైనా వీడియో అయిన మీ దృష్టికి వస్తే పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని సూచించారు.
నాగాబాబు ఏమన్నారంటే?
ఓ పార్టీ నేతలు మరో దారుణానికి శ్రీకారం చుట్టారని జనసేన నేత నాగబాబు నిన్న సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఓ పార్టీల వాళ్లు ఓటుకు నోటు ఇస్తున్నారని, ప్రతి ఇంటికీ డబ్బులు అందచేయడంతో పాటు.. డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని ఆరోపించారు. వాళ్లు 13వ తేదీన ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారన్నారు. ప్రతి ఓటరు డబ్బులు తీసుకుని ఇంట్లోనే ఉండేలా భయపెడుతున్నారన్నారు పిఠాపురం వంటి నియోజకవర్గంలో భారీగా డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి వేళ్ల మీద సిరా చుక్కలు వేసేలా పన్నాగం చేస్తున్నారన్నారు. ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్లినా సిరా గుర్తు చూసి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసేందుకు అమాయక ప్రజలను మళ్లీ ఆ పార్టీ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాగబాబు ఆరోపణలపై ఈసీ విచారణ జరిపింది. ఇందులో వాస్తవం లేదని తేల్చింది. నాగబాబు వీడియోను ఫేక్ వీడియోగా తేల్చింది.
చెరగని సిరా మరొకరి వద్ద అందుబాటులో ఉండదు-సీఈవో
చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.