AP EC On Indelible ink : ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం, 'చెరగని సిరా' ఈసీ వద్ద మాత్రమే ఉంటుంది - ఏపీ సీఈవో
AP Election Commission Updates : చెరగని సిరాపై ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది.చెరగని సిరా ఇతరుల వద్ద అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది. కేవలం ఈసీ వద్ద మాత్రమే ఉంటుందని తెలిపింది.
AP Elections 2024: చెరగని సిరా విషయంలో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వార్తలపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. చెరగని సిరా ఇతరుల వద్ద అందుబాటులో ఉంటుందంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపింది. చెరగని సిరా కేవలం భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని ఏపీ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటన విడుదల చేశారు.
చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని… ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు.
ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
14న ప్రత్యేక క్యాజువల్ లీవ్
ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14వ తేది మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలియ జేశారు. ఈమేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
మే 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ)గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీఓ) ఇతర పోలింగ్ సిబ్బంది (ఓపీఓ)కి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటీ) వర్తిస్తుందని తెలిపారు.
పోలింగ్ విధుల కోసం రిజర్వుడు సిబ్బందిగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిగా డ్రాప్టు చేసిన వారికి ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తించదని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వాస్తవంగా ఎవరైతే పోలింగ్ విధులు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తిస్తుందన్నారు.
అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారులందరికీ తెలియజేసి 13న పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని అప్పగించిన తర్వాత పీఓ, ఏపీఓ, ఓపీఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేసి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఈవో మీనా ఆదేశించారు.