Shashank Singh: ప్రీతి జింటా తప్పిదంతో జట్టులోకి వచ్చాడు -ఏకంగా ఇప్పుడు హీరోగా మారాడు - ఎవరీ శశాంక్ సింగ్?
05 April 2024, 11:35 IST
Shashank Singh: ఐపీఎల్‌లో గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు శశాంక్ సింగ్. ఈ మ్యాచ్‌తో శశాంక్ సింగ్ హీరోగా మారాడు.
శశాంక్ సింగ్
Shashank Singh: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హీరోగా మారారు శశాంక్ సింగ్. ఓటమి బాటలో పయనిస్తోన్న పంజాబ్ కింగ్స్‌కు సుడిగాలి ఇన్నింగ్స్‌తో అద్భుత విజయం అందించాడు శశాంక్ సింగ్. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన ఈ ప్లేయర్ రషీద్‌ఖాన్, ఉమేష్ యాదవ్ లాంటి దిగ్గజ బౌలర్లను చితక్కొట్టాడు.
29 బాల్స్‌లో 61 రన్స్...
29 బాల్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్న శశాంక్ సింగ్ ఓ బాల్ మిగిలుండగానే పంజాబ్‌కు రికార్డ్ విక్టరీని అందించాడు.
అశుతోష్ శర్మతో కలిసి...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లలో 199 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో పదిహేను ఓవర్లలో 150 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజాబ్‌ను శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ కలిసి గెలిపించారు. ఈ జోడీ 21 బాల్స్‌లోనే నలభై మూడు రన్స్ చేశారు.
పంజాబ్‌లోకి పొరపాటుగా వచ్చాడు...
శశాంక్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ కొనాలని అనుకోలేదు. గత ఏడాది డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ ఓనర్లు నెస్ వాడియా, ప్రీతి జింటా శశాంక్ అనే క్రికెటర్‌ను కొనబోయి పొరపాటుగా శశాంక్ సింగ్ కోసం ఇరవై లక్షలకు బిడ్ వేశారు. శశాంక్ సింగ్‌ను కొన్న తర్వాత తమ తప్పిందం గ్రహించారు. మీరు కొనాలనుకున్నది ఈ శశాంక్‌ను కాదా? ఈ క్రికెటర్ మీకు వద్దా అంటూ అక్షనర్ మల్లికా సాగర్ పంజాబ్ యాజమాన్యాన్ని అడిగిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఒక్క మ్యాచ్‌తోనే హీరో...
పొరపాటును సరిదిద్దుకునేందుకు మరో దారి లేకపోవడంతో శశాంక్ సింగ్‌ను తమ జట్టులోనే కొనసాగించారు. అ పొరపాటే ఇప్పుడు పంజాబ్ పాలిట వరంగా మారింది. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించి తన టాలెంట్ ఏమిటో పంజాబ్ యాజమాన్యంతో పాటు ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లకు చాటిచెప్పాడు శశాంక్ సింగ్.
ఒత్తిడిని ఎదుర్కొంటూ అలవోకగా శశాంక్ సింగ్ ఫోర్లు, సిక్సర్లు కొట్టిన తీరు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ వేసిన ఓ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు శశాంక్ సింగ్.
ఈ సీజన్‌లో పంజాబ్‌కు కీలకమైన బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు.శశాంక్ సింగ్ టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.కోట్లు పెట్టి కొన్న ప్లేయర్స్ కంటే 20 లక్షల పెట్టి కొన్న శశాంక్ సింగ్ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఐదో స్థానం...
గుజరాత్‌పై విజయంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచులు ఆడిన పంజాబ్ రెండింటిలో విజయం సాధించగా రెండో మ్యాచుల్లో ఓడిపోయింది.కాగా దేశవాళీలో శశాంక్ సింగ్ ఛత్తీస్ ఘడ్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.