Virat Kohli: టీ20ల్లో ఈ రెండు దేశాలపై కోహ్లి ఇప్పటివరకు డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు - ఆ దేశాలు ఏవంటే?
06 June 2024, 9:31 IST
Virat Kohli: టీ20 క్రికెట్‌లో ఐర్లాండ్‌తో పాటు స్కాట్‌లాండ్‌లపై కోహ్లి ఇప్పటివరకు డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయాడు. ఈ రెండు దేశాలతో ఇప్పటివరకు ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 12 రన్స్ మాత్రమే చేశాడు.
విరాట్ కోహ్లి
Virat Kohli: అసమాన ఆటతీరుతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లకు సాధ్యం కానీ ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లి బద్దలు కొట్టాడు. టెస్ట్, వన్డేలతో పాటు టీ20 ఇలా...ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా బ్యాట్‌తో చెలరేగిపోతూ పరుగుల వరద పారిస్తుంటాడు.
దాదాపుగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రికెట్ ఆడుతోన్న ప్రతి దేశంపై కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే టీ20 క్రికెట్‌లో మాత్రం ఓ రెండు దేశాలపై కోహ్లి ఇప్పటివరకు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయాడు. ఐర్లాండ్‌తో పాటు స్కాట్‌లాండ్‌లతో ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆడిన కోహ్లి అన్ని మ్యాచుల్లో కలిపి కేవలం పన్నెండు పరుగులు మాత్రమే చేశాడు.
ఐర్లాండ్‌పై మూడు మ్యాచ్‌లు...
ఐర్లాండ్‌తో ఇప్పటివరకు కోహ్లి మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లి. అందులో బుధవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ కూడా ఒకటి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన కోహ్లి కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఐదు బాల్స్ ఎదుర్కొన్న కోహ్లి ఒకే ఒక రన్ చేసి మార్క్ అదైర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు 2018లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లి.
అందులో ఓ మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లి...మరో మ్యాచ్‌లో తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. ఐర్లాండ్‌పై మూడు మ్యాచుల్లో కలిపి కేవలం పది పరుగులు మాత్రమే చేశాడు కోహ్లి. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌తో పాటు పలు అగ్ర దేశాలకు చుక్కలు చూపించిన కోహ్లి ఐర్లాండ్‌పై తన దూకుడును ప్రదర్శించలేకపోయాడు.
స్కాట్లాండ్‌పై రెండు పరుగులు...
స్కాట్‌లాండ్‌పై కోహ్లి ఇప్పటివరకు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లి. వాటిలో ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే కోహ్లికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ...
కోహ్లి విఫలమైన టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 37 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 రన్స్ తో రాణించాడు. రిషబ్ పంత్ 26 బాల్స్‌లో 36 రన్స్ చేయడంతో ఐర్లాండ్ విధించిన 97 పరుగుల టార్గెట్‌ను 12.2 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది.
అంతుకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. డేలానీ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్షదీప్, బుమ్రా తలో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.
ఐపీఎల్‌లో అదరగొట్టిన విరాట్...
ఇటీవల ముగిసన ఐపీఎల్ 2024 సీజన్‌లో కోహ్లి అదరగొట్టాడు. 15 మ్యాచుల్లో 741 రన్స్ చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.