Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-virat kohli reacted to retirement plans says he wants to give everything he has till the time he plays ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli On Retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
May 16, 2024 03:39 PM IST

Virat Kohli on retirement: విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కెరీర్లో ఇది చేయలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉండకూడదనీ, అందుకే రిటైర్మెంట్ లోపు అన్నీ చేసేస్తానని కోహ్లి అన్నాడు.

మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (AFP)

Virat Kohli on retirement: విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ఎప్పుడు? అందరు గొప్ప క్రికెటర్లలాగే కెరీర్ చివర్లో ఉన్న కోహ్లికి కూడా ఇదే ప్రశ్న తరచూ ఎదురువుతూ ఉంటుంది. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ని కూడా చివరి ఐదారేళ్ల పాటు ఎప్పుడు రిటైరవుతారన్న ప్రశ్నలు వేధించాయి. ఇప్పుడు ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి కూడా అదే ప్రశ్న. ఈ నేపథ్యంలో కోహ్లి తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చాడు.

ఎప్పటికీ ఆడలేను కదా: విరాట్ కోహ్లి

నిజానికి విరాట్ కోహ్లి 36 ఏళ్లకు చేరువవుతున్నా.. అతని ఫిట్‌నెస్ చూస్తే మరో ఐదారేళ్లు సులువుగా ఆడేలా కనిపిస్తున్నాడు. దీంతో కోహ్లి రిటైర్మెంట్ గురించి మరీ అంత చర్చేమీ జరగడం కాదు. కానీ కోహ్లియే ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీ నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొన్న విరాట్.. ఇన్నేళ్లయినా తాను ఇంకా పరుగుల కోసం అంత ఆకలిగా ఉండటానికి కారణమేంటో వివరించాడు.

ఈ ఈవెంట్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు కోహ్లి స్పందించాడు. "క్రీడాకారులుగా మా కెరీర్లకు ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది అని తెలుసు. నేను వెనుక నుంచి ముందుకు వెళ్తున్నాను. ఆ రోజు ఇలా చేసి ఉంటే ఎలా ఉండేది అన్న భావనతో నేను నా కెరీర్ ముగించాలని అనుకోవడం లేదు. నేను ఎప్పటికీ ఆడుతూనే ఉండలేను.

ఇది చేయలేకపోయానన్న బాధ నాకు తర్వాత ఉండకూడదు. అన్నీ పూర్తి చేసే వెళ్తాను. ఇప్పటి వరకైతే అలాంటిదేమీ లేదు. ఒకసారి నేను ఇక చాలు అనుకుంటే ఇక అంతే. మీరు నన్ను కొన్నాళ్ల వరకూ ఇక చూడలేరు. అందుకే నేను ఆడినన్ని రోజులూ నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. అదే నన్ను ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్తోంది" అని కోహ్లి అన్నాడు.

కోహ్లి పనైపోలేదు

రెండేళ్ల కిందట కోహ్లి చాలా రోజులుగా ఒక్క సెంచరీ కూడా చేయలేనప్పుడు ఇక అతని పనైపోయిందన్న విమర్శలు వచ్చాయి. కానీ అతడు మళ్లీ పుంజుకున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ఇక టీ20 క్రికెట్ కు అతడు పనికి రాడు.. స్ట్రైక్ రేట్ బాలేదన్న విమర్శలు వస్తున్నా కూడా ఇప్పటికీ ఈ ఫార్మాట్లో కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు.

ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల వీరుడు అతడే. ఇప్పటికీ అతని జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్నాడు. మరి ఇదే అతనికి చివరి వరల్డ్ కప్ అవుతుందా? 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్, 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడగలడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. తన రిటైర్మెంట్ పై కోహ్లి నేరుగా సమాధానం చెప్పకపోయినా.. అన్నీ సాధించే వెళ్తా అన్న అతని కామెంట్స్ ను బట్టి చూస్తే.. తన కెరీర్లో ఇంకా మిగిలిపోయిన లక్ష్యాలన్నింటినీ అతడు సాధించే వెళ్లేలా కనిపిస్తున్నాడు.

Whats_app_banner