Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు
Babar Azam Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం టీ20ల్లో మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈసారి టీమిండియా గ్రేట్ విరాట్ కోహ్లిని అతడు మించిపోవడం విశేషం.
Babar Azam Record: బాబర్ ఆజం టీ20ల్లో మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఐర్లాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో అతడు ఈ రికార్డు అందుకున్నాడు. అయితే ఈసారి అతడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ ఫార్మాట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్ గా బాబర్ నిలిచాడు.
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు
పాకిస్థాన్, ఐర్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో రికార్డులు బ్రేకయ్యాయి. ఈ రికార్డుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డు కూడా ఒకటి. తొలి టీ20లోనే ఐర్లాండ్ చేతుల్లో ఓడిన పాక్.. తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ఎగరేసుకుపోయింది. మంగళవారం (మే 14) జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది.
ఈ మ్యాచ్ లో బాబర్ ఆజం 42 బంతుల్లోనే 75 రన్స్ చేశాడు. అందులో ఐదు సిక్స్ లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో బాబర్ కు ఇది 39వ 50 ప్లస్ స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో 38 ఫిఫ్టీ 50 ప్లస్ స్కోర్లతో ఉన్న విరాట్ కోహ్లిని బాబర్ అధిగమించాడు. మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 34 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో ఉన్నాడు.
బాబర్ ఇతర రికార్డులు
బాబర్ ఆజం ఇదే మ్యాచ్ లో మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో ఒక ఓవర్లో 25 రన్స్ చేసిన తొలి బ్యాటర్ గా అతడు నిలిచాడు. బెంజమిన్ వైట్ వేసిన ఆ ఓవర్లో నాలుగు సిక్స్ లు కొట్టాడు బాబర్. తన కెరీర్లో తొలిసారి ఇలా ఒకే ఓవర్లో నాలుగు సిక్స్ లు బాదాడు. మరో సింగిల్ తో ఆ ఓవర్లో మొత్తంగా 25 రన్స్ చేశాడు.
ఇక ఇదే మూడో టీ20 మ్యాచ్ లో బాబర్ ఆజం రెండో వికెట్ కు మహ్మద్ రిజ్వాన్ తో కలిసి 139 రన్స్ జోడించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఇద్దరూ కలిసి సెంచరీకిపైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన సందర్భాలు పది కావడం విశేషం. ఈ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి జోడీ వీళ్లదే. ఇక ఈ ఇద్దరూ కలిసి 3 వేల పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశారు.
ఇంగ్లండ్‌కు పాకిస్థాన్
ఐర్లాండ్ లో మూడు టీ20ల సిరీస్ ముగించుకున్న పాకిస్థాన్.. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ కు వెళ్లనుంది. అక్కడ నాలుగు టీ20ల మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ మే 22న ప్రారంభమవుతుంది. మే 30న చివరి టీ20తో ఈ సిరీస్ ముగుస్తుంది. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ టీమ్ గ్రూప్ ఎలో ఉంది. ఇందులో ఇండియాతోపాటు ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా కూడా ఉన్నాయి. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ లో జరగనుంది.