India vs Ireland T20 World Cup: ఐర్లాండ్‌పై టీమిండియా రికార్డు ఇదీ.. ఎన్ని మ్యాచ్‌లలో గెలిచిందంటే..
India vs Ireland T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై ఇండియన్ టీమ్ రికార్డు ఎలా ఉంది? గతంలో ఎన్ని మ్యాచ్ లలో గెలిచిందో ఒకసారి చూద్దాం.
India vs Ireland T20 World Cup: ఇండియా, ఐర్లాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా మ్యాచ్ జరగబోతోంది. ఈరోజు (జూన్ 5) రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కన పెడితే ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఐర్లాండ్‌పై టీమిండియా రికార్డు ఇదీ
ఐర్లాండ్ తో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడటానికి ముందు ఏడు టీ20 మ్యాచ్ లలో టీమిండియా ఆ జట్టుతో తలపడింది. అన్ని మ్యాచ్ లలోనూ ఇండియానే గెలిచింది. టీ20ల్లోనే కాదు వన్డేల్లోనూ ఆ జట్టుపై ఇండియన్ టీమ్ కు ఓటమెరగని రికార్డు ఉంది. మూడు వన్డేలు ఆడగా.. అన్నింట్లోనూ ఇండియానే విజయం సాధించింది.
ఇండియా, ఐర్లాండ్ మధ్య జరిగిన ఏడు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఐర్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ బాల్‌బిర్నీ పేరిట ఉంది. అతడు ఆరు మ్యాచ్ లలో 138.05 స్ట్రైక్ రేట్ తో 156 రన్స్ చేశాడు. ఇక ఇండియా తరఫున దీపక్ హుడా టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతడు రెండు ఇన్నింగ్స్ లోనే 175.58 స్ట్రైక్ రేట్ తో 151 రన్స్ చేయడం విశేషం.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. అతడు మూడు ఇన్నింగ్స్ లో 137.96 స్ట్రైక్ రేటుతో 149 రన్స్ చేశాడు. బౌలింగ్ విషయానికి వస్తే.. ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్ లలో ఏడేసి వికెట్లతో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, క్రెయిగ్ యంగ్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. బుమ్రా ఆరు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
టీమిండియా తుది జట్టు ఇదేనా?
ఐర్లాండ్ తో జరగబోయే తొలి మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది? ఓపెనర్లు ఎవరు? ఈ ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లియే ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు న్యూయార్క్ పిచ్ టీ20లకు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ పిచ్ పై పరుగులు చేయడానికి బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. బంగ్లాదేశ్ తో ఇక్కడ టీమిండియా వామప్ మ్యాచ్ ఆడింది. అందులో రెండు జట్ల బ్యాటర్లు అంత సులువుగా రన్స్ చేయలేకపోయారు. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్ లో అయితే శ్రీలంక 77 రన్స్ కే కుప్పకూలింది. ఆ టార్గెట్ ను సౌతాఫ్రికా కిందామీదా పడి 16.4 ఓవర్లలో చేజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్ కు పిచ్ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.
టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్