SL vs SA: స్వల్ప లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించిన దక్షిణాఫ్రికా.. శ్రీలంకపై గెలిచి బోణీ-sl vs sa icc t20 world cup 2024 south africa won against sri lanka in low scoring game ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sl Vs Sa: స్వల్ప లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించిన దక్షిణాఫ్రికా.. శ్రీలంకపై గెలిచి బోణీ

SL vs SA: స్వల్ప లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించిన దక్షిణాఫ్రికా.. శ్రీలంకపై గెలిచి బోణీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 03, 2024 11:37 PM IST

SL vs SA T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. శ్రీలంకను చిత్తుచేసింది. స్వల్ప లక్ష్యాన్ని సఫారీలు కష్టంగా ఛేదించి.. ఎట్టకేలకు గెలిచారు.

SL vs SA: స్వల్ప లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించిన దక్షిణాఫ్రికా.. శ్రీలంకపై గెలిచి బోణీ
SL vs SA: స్వల్ప లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించిన దక్షిణాఫ్రికా.. శ్రీలంకపై గెలిచి బోణీ (PTI)

T20 World Cup 2024 SL vs SA: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. గెలుపుతో వేటను మొదలుపెట్టింది. న్యూయార్క్‌లోని నసావూ స్టేడియం వేదికగా నేడు (జూన్ 3) జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అయితే, లంకను ముందు తక్కువ స్కోరుకే ఔట్ చేసినా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సఫారీ జట్టు చెమటోడ్చింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..

నార్జే విజృంభణ.. కుప్పకూలిన లంక

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన శ్రీలంక కుప్పకూలిపోయింది. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. ఒక్కరు కూడా 20 పరుగుల మార్క్ చేరలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నార్జే (4/7) దెబ్బకు లంక బ్యాటర్లు విలవిల్లాడారు. నార్జే 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 19.1 ఓవర్లలో 77 పరుగులకే లంక ఆలౌటైంది.

కుషాల్ మెండిస్ (19), కమిందు మెండిస్ (11), అంజెలో మాథ్యూస్ (16) రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. పాతుమ్ నిస్సంక (3), వణిందు హసరంగ (0), సదీర సమరవిక్రమ (0) తీవ్రంగా నిరాశపరిచారు. వరుసగా వికెట్లు కోల్పోయిన శ్రీలంక లంక ఏ దశలోనూ దీటుగా ఆడలేకపోయింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్రిచ్ నార్జే నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. కేశవ్ మహారాజ్, కగిసో రబాడ తలా ఓ రెండు వికెట్లు తీసుకున్నారు.

కష్టపడిన దక్షిణాఫ్రికా

78 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కష్టంగా ఛేదించింది. బ్యాటర్లు చెమటోడ్చారు. 16.2 ఓవర్లలో 4 వికెట్లకు 80 రన్స్ చేసి సౌతాఫ్రికా గెలిచింది. రెజా హెండ్రిక్స్ (4) రెండో ఓవర్లో ఔట్ కాగా.. క్వింటన్ డికాక్ (27 బంతుల్లో 20 పరుగులు) నెమ్మదిగా ఆడాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ (14 బంతుల్లో 12 పరుగులు) నిదానంగా ముందుకు సాగాడు. ఐడెన్, డికాక్ ఔటయ్యాక ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 13 పరుగులు) టెస్టు మ్యాచ్‍ను తలపించే బ్యాటింగ్ చేశాడు. భారీ హిట్టర్లయినా వీరందరూ ఈ మ్యాచ్‍లో పరుగులు వేగంగా చేయలేకపోయారు. పిచ్ బ్యాటింగ్‍కు కఠినంగా అనిపించింది. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 19 పరుగులు నాటౌట్), డేవిడ్ మిల్లర్ (6 నాటౌట్) నిలిచి దక్షిణాఫ్రికాను గెలిపి తీరం దాటించారు. దీంతో వరల్డ్ కప్‍లో సఫారీ జట్టు బోణీ కొట్టింది.

శ్రీలంక బౌలర్లలో వాణిందు హసరంగ రెండు వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, దసున్ శనక చెరో వికెట్ దక్కించుకున్నారు.

బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్

న్యూయార్క్ పిచ్ శ్రీలంక, దక్షిణాప్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పూర్తిగా బౌలింగ్‍కు సహకరించింది. బంతి బ్యాట్ మీదకు సరిగా రాలేదు. దీంతో షాట్లు ఆడేందుకు బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.

ఐర్లాండ్‍తో జూన్ 5న ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍ను భారత్ ఇదే స్టేడియంలో ఆడనుంది. జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్‍లో జరగనుంది. మరి, ఆ మ్యాచ్‍లకు పిచ్ ఎలాగుంటుందో అనేది ఆసక్తికరంగా ఉంది. ఇలాగే, ఉంటే తక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.

టీ20 వరల్డ్ కప్ 2024