T20 WC 2024 India vs Ireland: ఐర్లాండ్‌తో టీమిండియా తుది జట్టు ఇదే.. ఓపెనర్లుగా ఆ ఇద్దరే..!-t20 world cup 2024 india vs ireland rohit sharma virat kohli may open pant over samson in playing xi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 Wc 2024 India Vs Ireland: ఐర్లాండ్‌తో టీమిండియా తుది జట్టు ఇదే.. ఓపెనర్లుగా ఆ ఇద్దరే..!

T20 WC 2024 India vs Ireland: ఐర్లాండ్‌తో టీమిండియా తుది జట్టు ఇదే.. ఓపెనర్లుగా ఆ ఇద్దరే..!

Hari Prasad S HT Telugu
Jun 05, 2024 10:29 AM IST

T20 WC 2024 India vs Ireland: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వేట మొదలు పెట్టబోతోంది. బుధవారం (జూన్ 5) గ్రూప్ ఎలో భాగంగా ఐర్లాండ్ తో తన తొలి మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది.

ఐర్లాండ్‌తో టీమిండియా తుది జట్టు ఇదే.. ఓపెనర్లుగా ఆ ఇద్దరే..!
ఐర్లాండ్‌తో టీమిండియా తుది జట్టు ఇదే.. ఓపెనర్లుగా ఆ ఇద్దరే..! (PTI)

T20 WC 2024 India vs Ireland: టీమిండియా టీ20 వరల్డ్ కప్ వేట మొదలవబోతోంది. ఈసారి పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడాలతో కలిసి గ్రూప్ ఎలో ఉన్న ఇండియన్ టీమ్.. తొలి మ్యాచ్ ను ఈరోజు (జూన్ 5) ఐర్లాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నాసౌ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టు, ఓపెనర్లు ఎవరు అనే విషయాలు ఇక్కడ చూడండి.

రోహిత్‌తో వచ్చేది విరాట్ కోహ్లియే..

టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లి ఫామ్ చూస్తుంటే.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది అతడే అని స్పష్టమవుతోంది. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్లో కోహ్లి ఓపెనర్ గా వచ్చి 741 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెబుతూ.. ఐపీఎల్ సెకండాఫ్ లో విరాట్ చెలరేగిపోయాడు. దీంతో రోహిత్, కోహ్లి జోడీ ఈ వరల్డ్ కప్ లో మ్యాజిక్ చేస్తుందని భావిస్తున్నారు. పవర్ ప్లేలో కోహ్లి క్లాస్, రోహిత్ మాస్ కలిస్తే ఎలాంటి ప్రత్యర్థికైనా గుండెల్లో దడ పుట్టాల్సిందే. టాపార్డర్ లో ఒకవేళ రోహిత్ భారీ షాట్లు ఆడబోయే త్వరగా ఔటైనా.. కోహ్లి బ్యాటింగ్ లైనప్ కు స్థిరత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్ గా విరాట్ కోహ్లికి మంచి రికార్డే ఉంది. అతడు 9 మ్యాచ్ లలో ఏకంగా 400 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 161.29 కాగా.. సగటు 57.14గా ఉంది. టీ20ల్లో అతడు చేసిన ఏకైక సెంచరీ కూడా ఓపెనర్ గా వచ్చి చేసిందే. 2022 ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై ఈ సెంచరీ చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

రిషబ్ పంత్ పక్కా..

కారు ప్రమాదం తర్వాత టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. వామప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అతడు చెలరేగిపోయాడు. మరోవైపు అతని కాంపిటీటర్ సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతని బదులు పంత్ తుది జట్టులో ఉండటం ఖాయం. మిడిలార్డర్ లో అతని అనుభవం టీమ్ కు బాగా పనికొస్తుంది.

పైగా చివరి ఓవర్లలో అతడు తన విశ్వరూపం చూపించగలడు. ఇక రోహిత్, కోహ్లి ఓపెనింగ్ చేస్తే మూడో స్థానంలో సూర్యకుమార్ వచ్చే ఛాన్స్ ఉంది. నాలుగో స్థానంలో శివమ్ దూబె, ఐదో స్థానంలో రిషబ్ పంత్ వస్తారు. ఆరు, ఏడు స్థానాల్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉంటారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది.

సిరాజ్ కు చోటు కష్టమేనా?

తుది జట్టులో పేస్ బౌలర్ సిరాజ్ కు చోటు కష్టంగానే కనిపిస్తోంది. బుమ్రా, అర్ష్‌దీప్ కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్ స్పిన్నర్లుగా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే.. సిరాజ్ ను పక్కన పెట్టాల్సిందే. మూడో పేసర్ రూపంలో ఎలాగూ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అవసరమైతే శివమ్ దూబె కూడా బౌలింగ్ చేస్తాడు.

టీమిండియా తుది జట్టు ఇదేనా?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

టీ20 వరల్డ్ కప్ 2024