Team India Openers: టీమిండియా ఓపెనర్లు ఎవరు? హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడో చూడండి
Team India Openers: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా తరఫున ఓపెనింగ్ చేసేది ఎవరు? ఈ విషయంపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సస్పెన్స్ ను మరింత పెంచాడు.
Team India Openers: టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు రాబోతున్నారు? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకూ సమాధానం దొరకడం లేదు. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం ఖాయం. కానీ అతనితోపాటు వచ్చేది ఎవరన్నది తేలాల్సి ఉంది. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
టీమిండియా ఓపెనర్లు ఎవరు?
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి ఓపెనర్ గా వచ్చి అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లోనూ అతన్నే ఓపెనర్ గా పంపిస్తారన్న చర్చ మొదలైంది. మరో రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జట్టులోనే ఉన్నాడు. దీంతో ఈ ముగ్గురిలో ఓపెనర్లుగా వచ్చే ఆ ఇద్దరూ ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
బంగ్లాదేశ్ తో జరిగిన వామప్ మ్యాచ్ కు కోహ్లి అందుబాటులో లేడు. కానీ ఈ మ్యాచ్ లో అనూహ్యంగా సంజూ శాంసన్ ను బరిలోకి దించారు. అతడు విఫలమయ్యాడు. ఇప్పుడు బుధవారం (జూన్ 5) ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఓపెనర్లు ఎవరు ప్రశ్నకు హెడ్ కోచ్ ద్రవిడ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని చివరి వరకూ సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం.
ఇప్పుడే చెప్పను: ద్రవిడ్
సోమవారం (జూన్ 3) ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓపెనర్లు ఎవరన్న ప్రశ్నపై స్పందించాడు. "మాకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అందుకే మేము ఇప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టదలచుకోలేదు. మా దగ్గర రోహిత్, జైస్వాల్ ఉన్నారు. విరాట్ కూడా ఐపీఎల్లో ఓపెనర్ గా వచ్చాడు. మేము ముగ్గురిని ఎంపిక చేశాం. దీనివల్ల మ్యాచ్ పరిస్థితులు, టీమ్ కాంబినేషన్ ను బట్టి వీళ్లలో నుంచి ఓపెనర్లు ఎవరన్నది నిర్ణయించాలన్నది మా ఉద్దేశం" అని ద్రవిడ్ చెప్పాడు.
అయితే ఇండియన్ టీమ్ ఇప్పటి వరకూ తమ తుది జట్టు, ఓపెనర్ల విషయంలో ఓ నిర్ణయానికి రాకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేవరెట్స్ లో ఒకటైన టీమిండియా.. ఇలా చేయడమేంటని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్లో ఓపెనర్ గా సక్సెసైన విరాట్ కోహ్లి.. ఇండియా తరఫున కూడా రాణించాడు.
అతడు ఇప్పటి వరకూ మొత్తంగా 117 టీ20లు ఆడాడు. అందులో 9సార్లు ఓపెనర్ గా వచ్చాడు. ఈ మ్యాచ్ లలో 161.29 స్ట్రైక్ రేట్ తో 400 రన్స్ చేయడం విశేషం. 2022లో జరిగిన ఆసియా కప్ లో అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ కూడా చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ పై అతడు 122 రన్స్ చేయడం విశేషం. ఈసారి బహుషా కోహ్లి, రోహిత్ ఇద్దరూ తమ చివరి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నారని చెప్పొచ్చు.
2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ సభ్యుడే అయినా.. కోహ్లి మాత్రం ఇప్పటి వరకూ ఈ ట్రోఫీ అందుకోలేదు. దీంతో అతడు మరింత పట్టుదలతో బరిలోకి దిగే అవకాశం ఉంది.