Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్ పదవిపై మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. ఏం చెప్పాడంటే..-gautam gambhir finally responds on team india head coach post ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్ పదవిపై మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. ఏం చెప్పాడంటే..

Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్ పదవిపై మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. ఏం చెప్పాడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 02, 2024 10:28 PM IST

Gautam Gambhir on Team India Head coach post: టీమిండియాకు హెడ్ కోచ్‍గా గౌతమ్ గంభీర్ నియమితుడవుతాడని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ విషయంపై గౌతీ తొలిసారి స్పందించాడు. మౌనం వీడాడు.

Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్ పదవిపై మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. ఏం చెప్పాడంటే..
Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్ పదవిపై మౌనం వీడిన గౌతమ్ గంభీర్.. ఏం చెప్పాడంటే..

Gautam Gambhir: టీమిండియాకు తదుపరి హెడ్ కోచ్ ఎవరనే విషయంపై కొంతకాలంగా చర్చ జోరుగా సాగుతోంది. ఈనెల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి లెజెండ్ రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. దీంతో తర్వాతి కోచ్‍ వేటలో బీసీసీఐ పడింది. అయితే, గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‍కతా నైట్‍రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్‍లో అద్భుతంగా ఆడి టైటిల్ సాధించింది. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్‍గా గంభీర్‌ను నియమించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. బీసీసీఐ కూడా ఈ దిశగా ఆలోచిస్తుందనే సంకేతాలు వచ్చాయి. రూమర్లు వస్తుండగా.. ఈ విషయంపై తొలిసారి పెదవి విప్పాడు గౌతమ్ గంభీర్.

అంతకంటే పెద్ద గౌరవం ఉండదు

టీమిండియాకు కోచ్‍గా ఉండడాన్ని తాను ఇష్టపడతానని గౌతమ్ గంభీర్ చెప్పాడు. జాతీయ జట్టుకు కోచ్‍గా ఉండడం కంటే పెద్ద గౌరవం మరేం ఉండదని అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాడు. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందని, అయితే భయం లేకుండా ఆడడం ముఖ్యమని గౌతీ చెప్పాడు.

భారత్.. ప్రపంచకప్ గెలిచేందుకు 140 కోట్ల మంది భారతీయులు మద్దతుగా ఉన్నారని గౌతమ్ గంభీర్ అన్నాడు. టీమిండియాకు కోచ్‍గా ఉండాలనుకుంటున్నారా.. ప్రపంచకప్ గెలిచేందుకు ఎలా హెల్ప్ చేస్తారని ఎదురైన ప్రశ్నకు గంభీర్ స్పందించారు. “టీమిండియాకు కోచ్‍గా ఉండడాన్ని నేను ఇష్టపడతా. మీ జాతీయ జట్టుకు కోచింగ్ చేయడం కంటే మరే పెద్ద గౌరవం ఉండదు” అని గౌతమ్ గంభీర్ అన్నాడు.

టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా భయం లేకుండా ఆడాలని గౌతమ్ గంభీర్ పరోక్షంగా సూచించాడు. భయం లేని ఆట చాలా ముఖ్యమని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ నేడు (జూన్ 2) షురూ అయింది. ఈ టోర్నీలో జూన్ 5న ఐర్లాండ్‍తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. 2007 తర్వాత మరెప్పుడూ టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలువలేదు భారత్. దీంతో ఈసారైనా టైటిల్ పట్టాలనే కసితో ఉంది రోహిత్ శర్మ సేన. ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్, 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏ ఐసీసీ టైటిల్ దక్కించుకోలేదు టీమిండియా. రోహిత్ కెప్టెన్సీలో గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరినా నిరాశే ఎదురైంది. దీంతో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ చాంపియన్‍గా నిలిచి టైటిల్ కరువును తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

కేకేఆర్‌ టైటిల్ గెలువడంతో..

గతంలో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన గౌతమ్ గంభీర్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‍లో ఆ జట్టుకు మెంటార్‌గా వెళ్లారు. 2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలో టైటిల్స్ సాధించిన కేకేఆర్ జట్టు మరెప్పుడూ చాంపియన్‍గా నిలువలేదు. ఈ ఏడాది గంభీర్ మెంటార్‌గా రావడంతో కోల్‍కతా దూకుడుగా ఆడింది. సీజన్ అంతా అద్భుత పర్ఫార్మెన్స్ చేసి టైటిల్ కూడా దక్కించుకుంది. పదేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్‍ను కేకేఆర్ కైవసం చేసుకుంది.

కోల్‍కతా జట్టుకు గంభీర్ దిశానిర్దేశం చేసిన తీరు, అతడి నిర్ణయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఐసీసీ ట్రోఫీ గెలువాలంటే టీమిండియాకు గౌతీ హెడ్‍కోచ్‍గా వెళ్లడమే కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా గంభీర్‌తో మాట్లాడారని ఇటీవల రూమర్లు వచ్చాయి. గంభీర్ కూడా ఇప్పుడు భారత హెడ్‍కోచ్ పదవిపై ఆసక్తిని వెల్లడించారు. మరి, గంభీర్‌నే బీసీసీఐ ఫైనలైజ్ చేస్తుందేమో చూడాలి.

Whats_app_banner