Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..
Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రానున్నాడా? రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ బాధ్యతలు అతనికే అప్పగించాలని బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Gambhir as Coach: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు అదే జట్టుకు హెడ్ కోచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తో ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త కోచ్ వేట మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో అతని స్థానంలో గంభీర్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.
హెడ్ కోచ్‌గా గంభీర్
గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కు మెంటార్ గా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు కెప్టెన్ గా కేకేఆర్ ను రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన గంభీర్ వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఆ టీమ్ అద్భుతంగా రాణిస్తోంది. ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్ గానే కాదు.. ఫస్ట్ ప్లేస్ కూడా సొంతం చేసుకుంది. దీంతో బీసీసీఐ కన్ను అతనిపై పడినట్లు తెలుస్తోంది.
హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 27 వరకు సమయం ఉంది. దీంతో బోర్డే అతన్ని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త హెడ్ కోచ్ ను ఎంపిక చేస్తుంది. పైగా ఈ పదవి కోసం బోర్డు రూపొందించిన అన్ని ప్రమాణాలనూ గంభీర్ అందుకున్నాడు. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడటం, వయసు 60 ఏళ్లలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్న విషయం తెలిసిందే.
ఆ లెక్కన గంభీర్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. అంతేకాదు ఇండియా గెలిచిన 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లలోనూ గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2012లో, 2014లో కెప్టెన్ గా కేకేఆర్ కు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. దీంతో ఏ రకంగా చూసినా.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ సూటవుతాడన్న భావన బీసీసీఐలో ఉంది.
గంభీర్ అంగీకరిస్తాడా?
ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఆ పదవి చేపట్టిన తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది కానీ అన్ని ఫార్మాట్లలోనూ మెరుగ్గానే రాణించింది. దీంతో అతడే కొనసాగితే బాగుంటుందన్న ఆలోచన కూడా బోర్డుకు ఉంది. కానీ ద్రవిడ్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. నిజానికి గతేడాదే అతని పదవీకాలం ముగిసినా.. టీ20 వరల్డ్ కప్ వరకు పొడిగించారు.
ఇప్పుడు సమయం దగ్గర పడటంతో కొత్త కోచ్ వేట మొదలుపెట్టారు. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఈ పదవిపై ఆసక్తిగా ఉన్నాడు. తాజాగా గంభీర్ పేరు తెరపైకి వస్తోంది. అయితే బీసీసీఐ ఆశిస్తున్నట్లు గంభీర్ దీనికి అంగీకరిస్తాడా? గడువులోపు ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్లేయర్స్ విషయంలో గంభీర్ కాస్త కఠినంగానే ఉంటాడన్న పేరుంది. నిజానికి ఈ సీజన్ మొదట్లోనే కేకేఆర్ జట్టుకు మెంటార్ గా వచ్చినప్పుడు అతడు అదే విషయాన్ని ప్లేయర్స్ కు చెప్పాడు. మరి అలాంటి ప్లేయర్ టీమిండియాకు హెడ్ కోచ్ గా వస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇటు అభిమానుల్లోనూ ఉంది.