Yuvraj Singh: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్-cricket news in telugu yuvraj singh named ambassador for t20 world cup 2024 icc announced it today 26th april ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yuvraj Singh: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

Yuvraj Singh: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

Hari Prasad S HT Telugu
Apr 26, 2024 04:11 PM IST

Yuvraj Singh: టీమిండియా లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు అంబాసిడర్ గా ఐసీసీ అతన్ని నియమించడం విశేషం.

ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

Yuvraj Singh: తొలి టీ20 వరల్డ్ కప్ లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించిన టీమిండియా లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ను ఈ ఏడాది వరల్డ్ కప్ కు అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది. ఈ విషయాన్ని ఐసీసీయే శుక్రవారం (ఏప్రిల్ 26) వెల్లడించింది. జూన్ 2 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

యువరాజ్ అంబాసిడర్

సిక్సర్ల కింగ్ గా పేరుగాంచిన యువరాజ్ సింగ్.. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ లోనే ఆరు సిక్స్‌లతో చరిత్ర సృష్టించాడు. యంగ్ టీమ్ తో బరిలోకి దిగిన టీమిండియా ఆ వరల్డ్ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. ఇప్పుడదే యువరాజ్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్ అయ్యాడు. ఈ సారి టోర్నీ ప్రారంభానికి ఇంకా 36 రోజుల సమయం ఉంది.

ఈలోపు అతడు అమెరికాలో ఈ మెగా టోర్నీని ప్రమోట్ చేయనున్నాడు. ఎన్నో ఈవెంట్లలో అతడు పాల్గొంటాడు. అంతేకాదు జూన్ 9న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ కు కూడా యువీ హాజరవుతాడు. తనను అంబాసిడర్ గా నియమించడంపై యువరాజ్ స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ తోనే తనకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నట్లు అతడు చెప్పాడు.

"టీ20 వరల్డ్ కప్ లో ఆడటం వల్లే నా కెరీర్లోని కొన్ని మరపురాని జ్ఞాపకాలను పొందాను. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కూడా అందులో భాగమే. అందుకే ఈసారి వరల్డ్ కప్ లో భాగం కావడం చాలా ఉత్సాహంగా ఉంది. క్రికెట్ ఆడటానికి వెస్టిండీస్ ఓ గొప్ప ప్రదేశం. అక్కడి ఫ్యాన్స్ క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేసే విధానం ప్రత్యేకమైనది. అంతేకాదు క్రికెట్ ఈ టీ20 వరల్డ్ కప్ ద్వారానే అమెరికాకు కూడా వ్యాపిస్తుండటం సంతోషంగా ఉంది" అని యువరాజ్ అన్నాడు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పైనా అతడు స్పందించాడు. "న్యూయార్క్ లో పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఈ ఏడాది జరగబోయే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్లలో ఒకటి. అందులో భాగం కావడం గొప్ప గౌరవం. కొత్త స్టేడియంలో ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్స్ తలపడబోతున్నారు" అని యువీ చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిథ్య యూఎస్ఏ, కెనడా తలపడనున్నాయి. పాకిస్థాన్ తో కలిసి ఇండియా గ్రూప్ ఎలో ఉంది. ఈ రెండు టీమ్స్ తోపాటు ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా టీమ్స్ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి.

ఇండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్ తో మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత జూన్ 12న యూఎస్ఏతో, జూన్ 15న కెనడాతో ఇండియా ఆడుతుంది. చివరిసారి 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో తలపడినప్పుడు ఇండియానే గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి టోర్నీలో మొత్తంగా 55 మ్యాచ్ లు జరగనున్నాయి. జూన్ 29న బార్బడోస్ లో ఫైనల్ జరగనుంది.

Whats_app_banner