Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై కన్నేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ద్రవిడ్ తర్వాత అతడేనా?
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఆ పదవిపై కన్నేశాడు. తాను ఆసక్తిగా ఉన్నట్లు అతడు చెప్పడం విశేషం.
Team India Head Coach: టీమిండియా తర్వాతి హెడ్ కోచ్ ఎవరు? టీ20 వరల్డ్ కప్ 2024లో రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. తర్వాతి హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై లాంగర్ కన్ను
సోమవారం (మే 13) రాత్రి నుంచి టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిపై జస్టిన్ లాంగర్ స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో అతడు మాట్లాడుతూ తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. "నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది.
ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది" అని లాంగర్ అన్నాడు.
అయితే బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. కానీ ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది.
లాంగర్ కోచ్ అవుతాడా?
ఈ నేపథ్యంలో జస్టిన్ లాంగర్ టీమిండియా కోచ్ అవుతాడా అన్న ఆసక్తి నెలకొంది. హెడ్ కోచ్ ను ఎంపిక చేసే బాధ్యత క్రికెట్ అడ్వైజరీ కమిటీ చేతుల్లో ఉంది. ఇందులో అశోక్ మల్హోత్రా, సులక్షణ నాయక్, జతిన్ పరాంజపేలాంటి వాళ్లు ఉన్నారు. వాళ్లు ఒకవేళ విదేశీ కోచ్ ను ఎంపిక చేయాలనుకుంటే మాత్రం లాంగర్ మంచి ఛాయిస్ అవుతాడు అనడంలో సందేహం లేదు.
జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.
ఈ సీజన్లోనూ ప్లేఆఫ్స్ రేసులోనే ఉంది. ఈ నేపథ్యంలో లాంగర్ పేరును కూడా బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సీరియస్ గానే పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా ఒకవేళ కోచ్ గా కొనసాగాలి అనుకుంటే దరఖాస్తు చేసుకొని ఎంపిక ప్రక్రియను ఫాలో కావాల్సి ఉంటుందని ఇప్పటికే జై షా స్పష్టం చేశారు. అయితే ఈ పదవిలో కొనసాగడానికి ద్రవిడ్ మాత్రం సుముఖంగా లేడు.