Gautam Gambhir: ఐపీఎల్ బాలీవుడ్ కాదు.. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన గౌతమ్ గంభీర్
Gautam Gambhir: ఐపీఎల్ ఏమీ బాలీవుడ్ కాదంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఈ సీజన్ లో అతడు మళ్లీ కేకేఆర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
Gautam Gambhir: ఐపీఎల్లో గత రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఇప్పుడు తన పాత టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కు మెంటార్ గా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే టీమ్ తో చేరిన తొలి రోజే తాను ప్లేయర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అతడు వెల్లడించాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ కాదని, సీరియస్ క్రికెట్ అని అతడు స్పష్టం చేశాడు.
కేకేఆర్‌కు గంభీర్ సలహా ఇదీ
గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ 2012, 2014లలో రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ట్రోఫీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. దీంతో మరోసారి గంభీర్ వైపే ఆ ఫ్రాంఛైజీ చూసింది. 2024 సీజన్ నుంచి అతడు కేకేఆర్ మెంటార్ గా వ్యవహరించనున్నాడు. ఈసారి జట్టులోకి ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) కూడా వస్తున్నాడు.
ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తో గంభీర్ మాట్లాడాడు. "నా వరకూ ఐపీఎల్ అంటే సీరియస్ క్రికెట్ అని తొలి రోజే స్పష్టం చేశాను. ఇది బాలీవుడ్ కాదు. మీరు, నేను కాదు. మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలు కాదు. ఫీల్డ్ లోకి వెళ్లి ఎంతో పోటీ ఉన్న క్రికెట్ ఆడటం. ఇదే సరైన క్రికెట్ కావడంతో ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యంత కఠినమైన లీగ్ గా నేను భావిస్తాను" అని గంభీర్ చెప్పాడు.
ఇక ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న ప్రాధాన్యతను కూడా అతడు వివరించాడు. "ఇతర లీగ్ లతో పోలిస్తే ఐపీఎల్ దాదాపు అంతర్జాతీయ క్రికెట్ కు దగ్గరగా ఉంటుంది. ఇందులో విజయవంతమైన ఫ్రాంఛైజీ కావాలనుకుంటే ఫీల్డ్ లో ఆడి చూపించాలి" అని గంభీర్ అన్నాడు.
కేకేఆర్ గురించి ఏమన్నాడంటే..
ఐపీఎల్ టైటిల్ ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన మూడో టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్. అయితే ఆ టీమ్ రెండుసార్లూ గంభీర్ కెప్టెన్సీలోనే టైటిల్ గెలిచింది. కానీ గత రెండు సీజన్లుగా ఆ టీమ్ కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరడం లేదు. అయినా కూడా కేకేఆర్ కు అండగా ఉన్న అభిమానులను గంభీర్ పొగిడాడు.
"కేకేఆర్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లతో మనం నిజాయతీగా ఉండాలి. కోల్‌కతా అభిమానులే అత్యంత నమ్మకమైన ఫ్యాన్స్ గా ఉన్నారు. వాళ్ల ముఖాలపై మరోసారి ఆ నవ్వులు తీసుకురావాలి. మొదటి మూడేళ్ల పాటు కేకేఆర్ ఫ్యాన్స్ చాలా ఎమోషన్స్ కు గురయ్యారు. కేకేఆర్ హై ప్రొఫైల్ టీమ్ కూడా. కానీ ఇది గ్లామర్ గురించి కాదు అని నేను భావిస్తాను. క్రికెట్ ఫీల్డ్ లో మనం ఏం చేశామన్నదే ముఖ్యం. కేకేఆర్ ఫీల్డ్ బయట కార్యకలాపాలతో పేరు తెచ్చుకోకూడదు. క్రికెట్ ఫీల్డ్ ఏం చేశామన్నదానితోనే పేరు రావాలి" అని గంభీర్ అన్నాడు.
ఐపీఎల్ 2024 ఈ ఏడాది మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత షెడ్యూల్లో భాగంగా 21 మ్యాచ్ ల తేదీలను అనౌన్స్ చేశాడు.