Prithvi Shaw Comments: 400 కొట్టేవాడినే.. నాటౌట్ అయినా ఔటిచ్చారు: పృథ్వీ షా
Prithvi Shaw Comments: 400 కొట్టేవాడినే కానీ తాను నాటౌట్ అయినా ఔటిచ్చారంటూ ముంబై బ్యాటర్ పృథ్వీ షా అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీలో అతడు 379 రన్స్‌తో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Prithvi Shaw Comments: టీమిండియా సెలక్టర్లకు మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు ముంబై బ్యాటర్ పృథ్వీ షా. ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నా.. తనకు నేషనల్ టీమ్‌లో అవకాశం ఇవ్వకపోవడంపై గతంలో చాలాసార్లు అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు మరోసారి తన బ్యాట్‌తోనే వాళ్లకు సమాధానమిచ్చాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 379 రన్స్ బాది చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఈ సమయంలో రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే అది కూడా నాటౌట్ అయినా ఔట్‌గా ఇచ్చారని, లేదంటే 400 చేసేవాడినే అని పృథ్వీ చెప్పడం విశేషం.
"నేను ఔట్ కాదు. ఈజీగా 400 చేసేవాడినే. చాలా బాగా అనిపిస్తోంది. ఆ 400 కూడా చేసే వాడిని. నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను. కొంతకాలంగా రంజీ ట్రోఫీలో బాగా ఆడలేకపోయాను. కానీ ఇప్పుడు భారీ స్కోరు చేశాను. క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడపాలని అనుకున్నాను. పిచ్‌కు తగినట్లు కాస్త సహనంతో బ్యాటింగ్ చేశాను" అని రెండో రోజు ఆట ముగిసిన తర్వాత పృథ్వీ చెప్పాడు.
అతని ట్రిపుల్ సెంచరీతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 687 పరుగుల భారీ స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. మరో టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే కూడా ఈ మ్యాచ్‌లో 191 రన్స్ చేయడం విశేషం. అతనితో కలిసి మూడో వికెట్‌కు పృథ్వీ ఏకంగా 401 రన్స్ జోడించాడు. పిచ్ మొదట్లో సీమర్లకు అనుకూలించిందని, ఆ తర్వాత మెల్లగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినట్లు పృథ్వీ చెప్పాడు.
ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా విమర్శకులకు కూడా గట్టి సమాధానమిచ్చాడు. "ఎవరూ నాతో నేరుగా ఏమీ మాట్లాడలేదు. కానీ కొంతమంది వాళ్లకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాళ్లను నేను పట్టించుకోను. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా గురించి అసలు ఏమీ తెలియని వాళ్లు కూడా నా గురించి కామెంట్స్ చేశారు. కొన్నిసార్లు నేను వాటిని చూసి పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో నాపై కామెంట్లు చేసే వాళ్లతో నాకు పనిలేదు. ఓ ప్లేయర్‌గా నన్ను నేను మెరుగు పరచుకోవడానికి ప్రయత్నిస్తాను" అని పృథ్వీ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్