Prithvi Shaw Record: రంజీల్లో పృథ్వీ షా కొత్త రికార్డు.. ఒక ఇన్నింగ్స్‌లో 379 రన్స్‌ బాదిన ముంబై బ్యాటర్‌-prithvi shaw record in ranji trophy with 379 runs marathon innings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Prithvi Shaw Record In Ranji Trophy With 379 Runs Marathon Innings

Prithvi Shaw Record: రంజీల్లో పృథ్వీ షా కొత్త రికార్డు.. ఒక ఇన్నింగ్స్‌లో 379 రన్స్‌ బాదిన ముంబై బ్యాటర్‌

Hari Prasad S HT Telugu
Jan 11, 2023 03:43 PM IST

Prithvi Shaw Record: రంజీల్లో పృథ్వీ షా కొత్త రికార్డు నెలకొల్పాడు. అస్సాంపై చెలరేగిపోయిన ఈ ముంబై బ్యాటర్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 379 రన్స్‌ బాదడం విశేషం.

పృథ్వీ షా
పృథ్వీ షా (PTI)

Prithvi Shaw Record: డొమెస్టిక్‌ క్రికెట్‌లో ఎంత చెలరేగినా నేషనల్‌ టీమ్‌లోకి ఎంపిక చేయడం లేదన్న బాధలో ఉన్న పృథ్వీ షా.. ఇప్పుడు మరింత రెచ్చిపోయాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతున్న పృథ్వీ.. ఏకంగా 379 రన్స్‌ చేయడం విశేషం.

తొలిరోజే 240 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పృథ్వీ.. రెండో రోజు మరో 99 బాల్స్‌లో 139 రన్స్‌ జోడించాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్‌ సాధించిన రెండో అత్యధిక స్కోరు ఇది. ఈ క్రమంలో అతడు ముంబై, టీమిండియా మాజీ ప్లేయర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ను వెనక్కి నెట్టాడు. రంజీ ట్రోఫీలో ఈ రికార్డు మహారాష్ట్ర బ్యాటర్‌ భావూసాహెబ్‌ నింబాల్కర్ పేరిట ఉంది.

అతడు 1948లో కథియావాడ్‌పై ఏకంగా 443 రన్స్‌ చేశాడు. ఇప్పటి వరకూ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఓ ఇండియన్‌ బ్యాటర్‌ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. ఇప్పుడతని తర్వాత పృథ్వీ షా రెండోస్థానంలో నిలిచాడు. ఇక రంజీట్రోఫీలో 350కిపైగా స్కోరు చేసిన 9వ బ్యాటర్‌ పృథ్వీ షా. అతని కంటే ముందు స్వాప్నిల్‌ గుగాలే (351), చెతేశ్వర్‌ పుజారా (352), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (353), సమిత్‌ గోహెల్‌ (359), విజయ్‌ మర్చంట్‌ (359), ఎంవీ శ్రీధర్‌ (366), సంజయ్‌ మంజ్రేకర్‌ (377) ఉన్నారు.

ఇప్పుడు అస్సాంపై పృథ్వీ ఆడిన ఇన్నింగ్స్‌ చూస్తే సులువుగా 400 స్కోరు దాటేలా కనిపించాడు. అయితే లెగ్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్ బౌలింగ్‌ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

పృథ్వీ షా ట్రిపుల్‌ సెంచరీతో ముంబై భారీ స్కోరు చేసింది. అటు అజింక్య రహానే కూడా సెంచరీ చేశాడు. రహానేతో కలిసి పృథ్వీ షా మూడో వికెట్‌కు ఏకంగా 401 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో మొదటి ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక హాఫ్‌ సెంచరీ మాత్రమే చేసిన పృథ్వీ.. ఈ భారీ ఇన్నింగ్స్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు.

WhatsApp channel

టాపిక్