Prithvi Shaw Comments on Selectors: ఆటగాడిగా రాణిస్తున్నా అవకాశాలు ఇవ్వడం లేదు - పృథ్వీ షా కామెంట్స్
Prithvi Shaw Comments on Selectors: ఆటగాడిగా రాణిస్తున్నా అవకాశాలు ఇవ్వకుండా తనను సెలెక్టర్లు పక్కనపెడుతున్నారని అన్నాడు టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ షా. అతడు చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Prithvi Shaw Comments on Selectors: పృథ్వీ షా టీమ్ ఇండియాకు దూరమై చాలా కాలమవుతోంది. రెండేళ్ల క్రితం చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు పృథ్వీషా. గత ఏడాది జూలైలో శ్రీలంకపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. తరచుగా గాయాల బారిన పడటం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పృథ్వీ షా టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాతో పాటు పలువురు యంగ్ క్రికెటర్స్ రాణించడంతో టీమ్ ఇండియాలో స్థానం కోసం గట్టి పోటీ ఏర్పడటం కూడా పృథ్వీషాకు ఇబ్బందికరంగా మారింది.
టీ20 వరల్డ్‌కప్‌లో అతడి పేరు కూడా పరిగణన లోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు అతడిని ఎంపికచేయలేదు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో పృథ్వీ షా రాణించాడు. న్యూజిలాండ్ ఏ తో జరిగిన అనధికారిక సిరీస్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయినా తనను సెలెక్టర్లు పక్కనపెట్టడం నిరాశను కలిగించిందని పృథ్వీషా అన్నాడు.
ఆటగాడిగా హార్డ్ వర్క్ చేస్తున్న అవకాశాలు మాత్రం దక్కడం లేదని అన్నాడు. బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడం ముఖ్యమని, ఆ విషయంలో తాను ప్రతి సారి నిరూపించుకుంటూనే ఉన్నానని అయినా తనను పక్కనపెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సెలెక్లర్లకు తనపై నమ్మకం కలిగిన రోజే అవకాశం ఇస్తారన్నది అవగతమవుతుందని, అప్పటివరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటానని పృథ్వీ షా అన్నాడు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ తర్వాత ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపాడు. దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గానని అన్నాడు. ఇందుకోసం డైట్ ప్లాన్ మొత్తం మార్చుకున్నట్లు పృథ్వీషా చెప్పాడు. ఆటలో టెక్నిక్ మార్చుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పాడు.