Ranji Trophy: చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవశం-madhya pradesh beat mumbai by 6 wickets to win their maiden ranji trophy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Madhya Pradesh Beat Mumbai By 6 Wickets To Win Their Maiden Ranji Trophy

Ranji Trophy: చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవశం

Hari Prasad S HT Telugu
Jun 26, 2022 02:51 PM IST

Ranji Trophyలో మధ్యప్రదేశ్‌ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఈ ప్రీమియర్‌ డొమెస్టిక్ టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది. డ్రాగా ముగుస్తుందనుకున్న ఫైనల్లో అనూహ్యంగా ముంబైని మట్టికరిపించి మరీ ట్రోఫీ ఎగరేసుకుపోయింది.

రంజీ ట్రోఫీతో ఛాంపియన్స్ మధ్యప్రదేశ్ టీమ్
రంజీ ట్రోఫీతో ఛాంపియన్స్ మధ్యప్రదేశ్ టీమ్ (Hotstar)

బెంగళూరు: రంజీ ట్రోఫీలో 41 సార్లు ఛాంపియన్‌ ముంబైకి పెద్ద షాకే తగిలింది. 47వసారి ఫైనల్‌ చేరి మరో టైటిల్‌పై కన్నేసిన ఆ టీమ్‌ను మధ్య ప్రదేశ్‌ గట్టి దెబ్బే కొట్టింది. ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన ఎంపీ టీమ్ 6 వికెట్లతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా అవతరించింది. 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌ చేరిన మధ్యప్రదేశ్‌.. టైటిల్‌ పోరులోనూ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ట్రెండింగ్ వార్తలు

చివరి రోజు 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంపీ.. 29.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిజానికి మ్యాచ్‌ డ్రా దిశగా సాగేలా కనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన ఎంపీ బౌలర్లు ముంబైని 269 పరుగులకే కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోరు చేసిన ఎంపీకి.. 162 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే.

ఒకవేళ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా మధ్యప్రదేశ్‌కే టైటిల్‌ దక్కేది. అయితే ఆ టీమ్‌ మాత్రం ముంబైపై పూర్తిగా పైచేయి సాధిస్తూ ఆ టీమ్‌ను చిత్తు చేసే తొలిసారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన శుభమ్‌ శర్మ, రజత్‌ పటీదార్‌లు రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన పరుగులు చేశారు. ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 274 రన్స్‌కు ఆలౌటైంది.

23 ఏళ్ల కిందట మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌గా ఉన్న చంద్రకాంత్‌ పండిట్‌.. ఇప్పుడా టీమ్‌కు కోచ్‌ కావడం విశేషం. అప్పుడు కెప్టెన్‌గా సాధించని ట్రోఫీని ఇప్పుడు అతడు కోచ్‌గా సాధించాడు. ఇది తనకెంతో గర్వకారణంగా ఉందని మ్యాచ్‌ తర్వాత చంద్రకాంత్‌ పండిట్‌ అన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 30 రన్స్‌ చేసిన శుభమ్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ నిలిచాడు. అతడు ఈ సీజన్‌లో ఏకంగా 982 రన్స్‌ చేయడం విశేషం. ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ సర్ఫరాజ్‌ సెంచరీ చేశాడు.

WhatsApp channel

టాపిక్