Cricket | ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు, లిస్ట్‌ ఎ క్రికెట్‌కు తేడా ఏంటో తెలుసా?-do you know the difference between first class and list a cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Do You Know The Difference Between First Class And List A Cricket

Cricket | ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు, లిస్ట్‌ ఎ క్రికెట్‌కు తేడా ఏంటో తెలుసా?

Hari Prasad S HT Telugu
Dec 22, 2021 04:30 PM IST

Cricket.. క్రికెట్‌ అంటే ఓ వినోదంగా మారిపోయిన ఈ కాలంలో టీ20, టీ10, 100 బాల్స్ క్రికెట్‌ వంటి వినూత్న టోర్నీలూ పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అంటే ఏంటి? లిస్ట్‌ ఎ క్రికెట్‌ కిందికి వచ్చేవి ఏవి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

వన్డే మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న కాన్పూర్ పిచ్
వన్డే మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న కాన్పూర్ పిచ్ (PTI)

క్రికెట్‌లో తరచూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, లిస్ట్‌ ఎ క్రికెట్‌ అనే మాటలు వినిపిస్తాయి. అయితే వీటి మధ్య తేడా ఏంటి? క్రికెట్‌ను చాలా ఏళ్లుగా ఫాలో అవుతున్న వారికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కానీ.. ఇప్పుడిప్పుడే క్రికెట్‌ను ఫాలో అవుతున్న వారికి వీటి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఏంటన్నది తెలియదు. సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న క్రికెట్‌ను ఎన్నో విధాలుగా ఆడతారు. 

ఈ కాలంలో ఆటలో కూడా కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు కూడా వచ్చాయి. ముఖ్యంగా క్రికెట్‌ అంటే ఓ వినోదంగా మారిపోయిన ఈ కాలంలో టీ20, టీ10, 100 బాల్స్ క్రికెట్‌ వంటి వినూత్న టోర్నీలూ పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అంటే ఏంటి? లిస్ట్‌ ఎ క్రికెట్‌ కిందికి వచ్చేవి ఏవి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఫస్ట్‌-క్లాస్‌ క్రికెట్‌

క్రికెట్‌లో అత్యున్నత స్థాయిగా భావించేదే ఈ ఫస్ట్‌-క్లాస్‌ క్రికెట్‌. అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్‌ క్రికెట్‌ ఈ ఫస్ట్‌-క్లాస్‌ క్రికెట్‌ కేటగిరీలోకి వస్తుంది. సాధారణంగా దేశవాళీ క్రికెట్‌ విషయంలోనే ఈ ఫస్ట్‌-క్లాస్‌ అనే పదం వాడతారు కానీ.. ఓ ప్లేయర్‌ టెస్టు రికార్డులు కూడా ఓవరాల్‌గా ఈ ఫస్ట్‌-క్లాస్‌ కేటగిరీలోకి వస్తాయి. ఓ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో ఒక్కో టీమ్‌కు కచ్చితంగా రెండేసి ఇన్నింగ్స్‌ ఉంటాయి. కనీసం మూడు రోజులైనా ఆడాలి. 

ఇండియాలోని దేశవాళీ టోర్నీలైన రంజీ ట్రోఫీ, దులీప్‌ట్రోఫీలాంటివి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కిందకే వస్తాయి. ఐసీసీలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాల్లో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లు, రెండు దేశవాళీ టీమ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌లు కూడా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లే. అంతేకాదు ఓ టెస్ట్‌ టీమ్‌ మరో దేశ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ టెస్ట్‌ దేశ ఫస్ట్‌క్లాస్‌ డొమెస్టిక్‌ టీమ్‌తో ఆడే మ్యాచ్‌లను కూడా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌గానే పరిగణిస్తారు. 1894లో దీనికి అధికారిక హోదా వచ్చింది.

లిస్ట్‌ ఎ క్రికెట్‌

ఒక్కో టీమ్‌ 40 నుంచి 60 ఓవర్లు ఆడే పరిమిత ఓవర్ల క్రికెట్‌ను లిస్ట్‌ ఎ క్రికెట్‌గా పరిగణిస్తారు. దేశవాళీతోపాటు అంతర్జాతీయంగా ఆడుతున్న వన్డే మ్యాచ్‌లు ఈ లిస్ట్‌ ఎ కేటగిరీ కిందికి వస్తాయి. ఇందులో ఒక్కో టీమ్‌ ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడతాయి. ఒకే రోజులో మ్యాచ్‌ ముగుస్తుంది. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే.. రిజర్వ్‌ డే పేరుతో తర్వాతి రోజు కూడా మ్యాచ్‌ కొనసాగే అవకాశం ఉంటుంది. 

చాలా దేశాల్లో వివిధ డొమెస్టిక్‌ లిస్ట్‌ ఎ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇండియాలో దేవ్‌ధర్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ పేరుతో లిస్ట్‌ ఎ పరిమిత ఓవర్ల క్రికెట్‌ టోర్నీలు ఉన్నాయి. 2006లోనే ఐసీసీ ఈ లిస్ట్‌ ఎ క్రికెట్‌ను ప్రత్యేక కేటగిరీగా గుర్తించింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు సమాంతరంగా తమ రికార్డు బుక్కుల కోసం అసోసియేషన్ ఆఫ్‌ క్రికెట్‌ స్టాటిస్టిషియన్స్‌ అండ్‌ హిస్టారియన్స్‌ దీనిని సృష్టించారు.

ట్వంటీ20 క్రికెట్‌

ట్వంటీ20 క్రికెట్ కూడా పరిమిత ఓవర్ల క్రికెటే అయినా ఇది లిస్ట్‌ ఎ కిందికి రాదు. క్రికెట్‌ ఆడే విధానంలో ఇది మూడో కేటగిరీ. 2003లో తొలిసారి ఇంగ్లండ్‌లో ఈ ఫార్మాట్‌ పుట్టుకొచ్చింది. ఒక్కో టీమ్‌ 20 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడుతుంది. ఈ ఫార్మాట్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆడే చాలా దేశాల్లో ఈ ఫార్మాట్‌లో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఇండియాలో ఐపీఎల్‌ ఎంత పాపులరో తెలిసిందే. ఇలాగే ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, శ్రీలంకల్లోనూ డొమెస్టిక్‌ టీ20 లీగ్స్‌ జరుగుతున్నాయి.

ఇక యూఏఈలో 2017లో ప్రారంభమైన టీ10 క్రికెట్‌, ఇంగ్లండ్‌లో ఈ మధ్యే తొలిసారి జరిగిన 100 బాల్స్‌ క్రికెట్‌ టోర్నీలు కూడా తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2018లో షార్జాలో జరిగిన టీ10 క్రికెట్‌ టోర్నీకి ఐసీసీయే స్పాన్సర్‌గా వ్యవహరించడం విశేషం.

 

WhatsApp channel

సంబంధిత కథనం