IND vs BAN 2nd T20: ఢిల్లీకి చేరుకున్న భారత్ జట్టు.. కెప్టెన్ సూర్యకుమార్ భాంగ్రా డ్యాన్స్
08 October 2024, 14:59 IST
India vs Bangladesh 2nd T20: గ్వాలియర్ టీ20లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ జట్టు.. రెండో టీ20 కోసం ఢిల్లీకి చేరుకుంది. ఈ టీ20 సిరీస్ హైదరాబాద్ జరగనున్న మ్యాచ్‌తో ముగియనుంది.
సూర్యకుమార్ భాంగ్రా డ్యాన్స్
భారత్ టీ20 జట్టు మంగళవారం ఢిల్లీకి చేరుకుంది. గత ఆదివారం బంగ్లాదేశ్‌తో గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20 మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 9న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీకి భారత్ జట్టు చేరుకుంది.
ఢిల్లీకి చేరుకోగానే భారత్ జట్టుకి హోటల్‌లో అపూర్వ స్వాగతం లభించింది. డప్పుతో ఆటగాళ్ల పేర్లు చెప్తూ స్వాగతం పలకగా, టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రైడ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. అదే సమయంలో సూర్య భాంగ్రా డ్యాన్స్‌తో టీమ్ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు.
ఈ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షేర్ చేసింది. తొలి టీ20కి ఆతిథ్యమిచ్చిన గ్వాలియర్‌కు ఆటగాళ్లు వీడ్కోలు పలకడంతో పాటు ఢిల్లీ హోటల్‌కు చేరుకోవడానికి మధ్య జరిగిన కొన్ని సరదా క్షణాలను అభిమానులతో ఆ వీడియోలో బీసీసీఐ పంచుకుంది.
ఈ టీ20 సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో మాట్లాడుతూ టీ20 సిరీస్‌లో తమ జట్టు దూకుడుగా ఆడుతుందని చెప్పాడు. కానీ.. గ్వాలియర్ టీ20లో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే 19.5 ఓవర్లలో ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని భారత్ జట్టు కేవలం 12 ఓవర్లలోనే ఛేదించేసింది.
టీ20ల్లో పవర్ ప్లేలో వేగంగా బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమని తొలి టీ20 తర్వాత బంగ్లా కెప్టెన్ సహచరులకి వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం భారత బ్యాటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను .. టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండు జట్ల మధ్య అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగియనుంది.
టాపిక్