Hardik Pandya No Look Shot: తొలి టీ20లో హార్దిక్ పాండ్య షాట్‌తో నోరెళ్లబెట్టిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్, వీడియో వైరల్-indian cricketer hardik pandya hits a stunning no look boundary off taskin ahmed during ind vs ban 1st t20 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya No Look Shot: తొలి టీ20లో హార్దిక్ పాండ్య షాట్‌తో నోరెళ్లబెట్టిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్, వీడియో వైరల్

Hardik Pandya No Look Shot: తొలి టీ20లో హార్దిక్ పాండ్య షాట్‌తో నోరెళ్లబెట్టిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్, వీడియో వైరల్

Galeti Rajendra HT Telugu
Oct 07, 2024 07:00 AM IST

IND vs BAN 1st T20: తొలి టీ20లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ కవ్వింపులకి బ్యాట్‌తోనే హార్దిక్ పాండ్యా సమాధానం ఇచ్చాడు. తస్కిన్ విసిరిన బంతిని కీపర్ తలమీదుగా బౌండరీకి పంపిన హార్దిక్.. కనీసం బంతి వెళ్లిన తీరుని కూడా చూడలేదు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య

బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషిస్తూ టీమ్‌కి అలవోక విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన నో లుక్ షాట్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

షాట్ ఆడిన తర్వాత ఆఖరి వరకు కనీసం బంతి వైపు చూడని హార్దిక్ పాండ్య.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ వైపు అలానే చూస్తూ కనిపించాడు. హార్దిక్ షాట్‌ను చూసి స్టేడియంలోని ప్రేక్షకులు, కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు.

ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుస బంతుల్లో బౌండరీలు కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ నుంచి చిన్నపాటి కవ్వింపు ఎదురైంది. దాంతో ఆ ఓవర్ మూడో బంతికి చాలా క్యాజువల్‌గా హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

వాస్తవానికి హార్దిక్ పాండ్య నో లుక్ షాట్ చాలా ప్రమాదం. ఔట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ.. బౌలర్ తస్కిన్ అహ్మద్ వేగాన్ని అంచనా వేయడంతో పాటు సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్య కీపర్‌పై నుంచి బంతిని బౌండరీకి తరలించాడు.

బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి బౌండరీకి దూసుకెళ్లింది. ఆ షాట్‌ను చూసిన తస్కిన్ అహ్మద్‌ కూడా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్‌లో మొత్తం 16 బంతులాడిన హార్దిక్ పాండ్య 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు చేసి టీమ్‌ను గెలిపించాడు.

గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ తొలి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 49 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్ జట్టులో హార్దిక్ పాండ్య టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఛేదనలో దూకుడుగా ఆడిన భారత్ జట్టు ప్లేయర్లు 7 సిక్సర్లు, 15 సిక్సర్లు బాదారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ 3, తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి ఒకటి, హార్దిక్ పాండ్యా రెండు కొట్టారు. కానీ.. బంగ్లాదేశ్ టీమ్‌ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 9 ఫోర్లు మాత్రమే ఉన్నాయి.

రెండో టీ20 మ్యాచ్‌ బుధవారం ఢిల్లీ వేదికగా జరగనుండగా.. ఆఖరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. శనివారం రాత్రి హైదరాబాద్ టీ20 జరగనుంది.

Whats_app_banner