IND vs BAN 1st T20: బంగ్లాదేశ్‍ను బెంబేలెత్తించిన భారత్.. టార్గెట్‍ను ఊదేసిన సూర్యసేన.. తొలి టీ20లో అలవోక గెలుపు
IND vs BAN 1st T20: బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో భారత్ అలవోకగా గెలిచింది. ఆల్‍రౌండ్ షోతో బంగ్లాను చిత్తుచేసింది. బౌలింగ్‍లో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మెరిశారు. హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు.
బంగ్లాదేశ్‍పై భారత్ ఆధిపత్య విజయం సాధించింది. తొలి టీ20లో బంగ్లాను బెంబెలెత్తించి ఆడుతూ పాడుతూ గెలిచేసింది. గ్వాలియర్ వేదికగా నేడు (అక్టోబర్ 6) జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‍లో 1-0తో ఆధిపత్యంలోకి వచ్చేసింది. 49 బంతులను మిగిల్చి భారత్ గెలిచింది .
అర్షదీప్, వరుణ్ దెబ్బ.. బంగ్లా ఢమాల్
భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‍లో విజృంభించాడు. 3.5 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్లోనే లిటన్ దాస్‍ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా అదరగొట్టాడు. మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. వీరి విజృంభణతో బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుసేనే శాంతో (27) కాస్త నిలిచాడు. మెహదీ హసన్ మిరాజ్ (32 బంతుల్లో 35 పరుగులు; నాటౌట్) చివరి వరకు పోరాడాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‍కు క్యూ కట్టారు. దీంతో బంగ్లా కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్షదీప్, వరుణ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా, అరంగేట్ర పేసర్ మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ కైవసం చేసుకున్నారు.
భారత్.. ధనాధన్
లక్ష్యఛేదనలో భారత్ ధనాధన్ ఆటతో మోతెక్కించింది. హిట్టింగ్‍తో బంగ్లా బౌలర్లను టీమిండియా బ్యాటర్లు హడలెత్తించారు. భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (7 బంతుల్లో 16 పరుగులు; 2 ఫోర్లు, ఓ సిక్స్) ఉన్నంత సేపు దుమ్మురేపాడు. ఆరంభం నుంచే హిట్టింగ్ చేశాడు. అయితే రెండో ఓవర్లో రనౌట్ అయ్యాడు.
ఇక ఓపెనర్‌గా మారిన సంజూ శాంసన్ (19 బంతుల్లో 29 పరుగులు; 6 ఫోర్లు) మరోవైపు తొలి ఓవర్ నుంచే క్లాసీ షాట్లతో దుమ్మురేపాడు. దూకుడుగా ఆడాడు. అభిషేక్ ఔటైనా జోరు సాగించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 29 పరుగులు; 2 ఫోర్లు, 3 సిక్స్) తన మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు. ఉన్నంతసేపు విధ్వంసం చేశాడు. దీంతో 4.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ క్రాస్ చేసింది భారత్.
దుమ్మురేపిన హార్దిక్
జోరు మీద ఉన్న సూర్యకుమార్ ఆరో ఓవర్లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. సంజూ కూడా ఎనిమదో ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‍తోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 16 పరుగులు నాటౌట్; ఓ సిక్స్) ఆచితూచి ఆడాడు. చివరి వరకు నిలిచాడు. అయితే, హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39 పరుగులు నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్లాస్ట్ చేసేశాడు. భీకర హిట్టింగ్‍తో అదరగొట్టాడు. కళ్లు చెదిరే షాట్లతో మెప్పించాడు. దీంతో లక్ష్యం అలా కరిగిపోయింది. 11.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 132 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది. 49 బంతులను మిగిల్చి.. ఆధిపత్యంతో ఆడుతూ పాడుతూ గెలిచింది సూర్యకుమార్ సారథ్యంలోని యంగ్ టీమిండియా.
ఈ తొలి మ్యాచ్ గెలిచి మూడు టీ20ల సిరీస్‍లో 1-0తో భారత్ ముందడుగు వేసింది. టీమిండియా, బంగ్లా మధ్య అక్టోబర్ 9వ తేదీన ఢిల్లీ వేదికగా రెండో టీ20 జరగనుంది.