Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఆడనున్న టీమిండియా.. హిట్టింగ్ మోతే.. ఐదే ఓవర్లు..ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!
Hong Kong Sixes Tournament Rules: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో హిట్టింగ్ ధమాకా ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్‍లుగా ఉంటాయి. మరిన్ని క్రేజీ రూల్స్ ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మళ్లీ వస్తోంది. సుమారు ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ మళ్లీ జరుగుతోంది. గతంలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే లాంచి భారత దిగ్గజాలతో పాటు చాలా మంది విదేశీ స్టార్లు ఈ టోర్నీ ఆడారు. ఈ ఏడాది మళ్లీ ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ కూడా బరిలోకి దిగనుంది.
టోర్నీ ఎప్పుడంటే..
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజుల పాటు ఈ టోర్నీ సాగుతుంది. హాంకాంగ్ కొవ్‍లూన్‍లోని టిన్ క్వోంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్ ఈ టోర్నీకి వేదికగా ఉంది. ఈ టోర్నీలో సిక్సర్ల హిట్టింగ్ ధమాకా ఉంటుంది.
ఈ టోర్నీలో భారత్ బరిలోకి దిగనుందంటూ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ నిర్వాహకులు నేడు (అక్టోబర్ 7) ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. “హాంకాంగ్ సిక్సెర్ టోర్నీలో దుమ్మురేపేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా జరిగే హిట్టింగ్ విధ్వంసానికి సిద్ధంగా ఉండండి. మరిన్ని జట్లు.. మరింత ఎగ్జైట్‍మెంట్, థ్రిల్స్ ఉంటాయి” అని హాంకాంగ్ టోర్నీ పోస్ట్ చేసింది.
ఎవరు ఆడతారో..
హాంకాంగ్ టోర్నీలో టీమిండియా తరఫున ఎవరు ఆడతారోననే ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై చెప్పి.. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్న స్టార్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ టోర్నీకి వెళ్లే అవకాశాలు తక్కువే. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ లాంటి స్టార్ హిట్టర్లు వెళ్లే అవకాశం ఉంది. మరి భారత్ తరఫున హాంకాంగ్ టోర్నీకి టీమిండియా నుంచి ఏ ఆటగాళ్లు ఆడతారో చూడాలి.
ఐదు ఓవర్లు.. ఆరుగురే ప్లేయర్లు.. రూల్స్ ఇవే
హాంకాంగ్ టోర్నీ గతంలో జరగడంతో రూల్స్ ఇప్పటికే తెలిసిపోయాయి.
- మ్యాచ్ ఆడే రెండు జట్లలో చెరో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి.
- ఒక్కో జట్టు ఐదు ఓవర్లు ఆడాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు సాధారణంగా ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్‍లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి.
- ఒక్కో వైడ్, నోబాల్‍కు రెండు పరుగులు వస్తాయి. ఐదు వికెట్లు పడితే ఒక సైడ్ కూడా బ్యాటర్ బ్యాటింగ్ చేయవచ్చు.
- 31 పరుగులు చేసిన బ్యాటర్ రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. లోవర్ ఆర్డర్ బ్యాటర్లు ఔటయ్యాక మళ్లీ బ్యాటింగ్‍కు రావొచ్చు.
గతంలో హాంకాంగ్ టోర్నీలో ఇవే రూల్స్ ఉన్నాయి. ఈసారి కూడా ఇవే నిబంధనలతో టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి. ఈ టోర్నీలో 8 లేకపోతే 12 జట్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈసారి పాకిస్థాన్ కూడా ఆడనుంది. దీంతో హాంకాంగ్ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందేమోననే ఆసక్తి కూడా నెలకొంది.
2005లో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆ ఏడాది టోర్నీలో ఫైనల్‍లో వెస్టిండీస్‍ను ఓడించి భారత్ టైటిల్ సాధించింది. 1992 ఆ టోర్నీ మొదలైంది. చివరగా 2017లో ఈ టోర్నీ జరిగింది. ఆ తర్వాత నిలిచిపోయింది. ఈ ఏడాది మళ్లీ షురూ అవుతోంది.