IND vs BAN 1st T20: అభిషేక్ శర్మ రనౌట్‌లో తప్పు ఎవరిది? బంగ్లాదేశ్‌కి గిఫ్ట్‌గా వికెట్!
Abhishek Sharma Run Out: బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా అలవోకగా గెలిచింది. కానీ.. ఓపెనర్ల మధ్య మిస్ కమ్యూనికేషన్ భారత్ జట్టు మేనేజ్‌మెంట్‌కి ఇప్పుడు తలనొప్పిగా మారింది.
బంగ్లాదేశ్‌తో గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. కానీ.. ఈ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్ అయిన తీరు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కి చికాకు తెప్పించింది.
మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో సత్తాచాటిన భారత్ జట్టు ఏ దశలోనూ బంగ్లాదేశ్‌కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. కానీ.. అభిషేక్ శర్మ రనౌట్ విషయంలో మాత్రం ఆ జట్టుకి గిఫ్ట్‌గా వికెట్ ఇచ్చినట్లు అయ్యింది.
అసలు ఏం జరిగింది?
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఛేదనకు దిగిన భారత్ జట్టుకి అభిషేక్ శర్మ 7 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్స్‌తో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది మంచి టచ్‌లో కనిపించాడు. కానీ.. అదే ఓవర్‌లో ఊహించని విధంగా అభిషేక్ శర్మ రనౌట్ అయ్యాడు.
రెండో ఓవర్ ఆఖరి బంతిని తస్కిన్ గుడ్ లెంగ్త్ రూపంలో విసరగా.. సంజు శాంసన్ సాఫ్ట్‌గా షార్ట్ మిడ్ వికెట్ దిశగా ఫుష్ చేశాడు. వెంటనే సింగిల్ కోసం క్రీజు నుంచి వెలుపలికి సంజు మూడు అడుగులు వేశాడు. కానీ బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో సింగిల్ ఆలోచన విరమించుకున్నాడు. అయితే.. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ క్రీజు సగంలోకి వచ్చేశాడు. దాంతో బంతిని అందుకున్న తోవిద్ డైరెక్ట్ త్రో విసిరి రనౌట్ చేశాడు.
తప్పు ఎవరిది?
వాస్తవానికి సింగిల్ కోసం సంజు శాంసన్ తొలుత పిలిచాడు. కానీ.. స్ట్రైకింగ్‌లో బ్యాటర్ కంటే బంతి గమనాన్ని ఎక్కువ పరిశీలించాల్సింది నాన్ స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటరే. అయితే.. అభిషేక్ శర్మ ఇక్కడే విఫలమయ్యాడు. బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్తున్నా.. అనాలోచితంగా పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. దాంతో సంజు వేగంగా మళ్లీ క్రీజులోకి వెళ్లగలిగినా అభిషేక్ వెళ్లలేకపోయాడు. మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిషేక్ శర్మ తొందరపాటుని తప్పుబట్టారు.
అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ శర్మని ఓపెనర్‌గా కొనసాగించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ఇటీవల టీ20లకి గుడ్ బై చెప్పగా.. అతని స్థానంలో సరైన ఓపెనర్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ అన్వేషిస్తోంది.
ఫస్ట్ ఛాన్స్ వృథా
ఇప్పటికే యశస్వి జైస్వాల్ ఈ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతనికి జోడీగా శుభమన్ గిల్, అభిషేక్ శర్మలో ఒకరిని ఆడించాలని భారత్ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే.. ఆ ఇద్దరూ రెగ్యులర్‌గా ఇప్పుడు టెస్టులు ఆడుతుండటంతో.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ జోడికి అవకాశం దక్కింది. కానీ.. తొలి టీ20లోనే ఈ జంట రనౌట్‌తో చేదు అనుభవాన్ని మిగిల్చింది.