IND vs BAN: ఈరోజే భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20.. ఢిల్లీ పిచ్, రికార్డులిలా!
09 October 2024, 6:10 IST
India vs Bangladesh 2nd T20: గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో ఓ ఆట ఆడుకున్న భారత్ జట్టు.. ఈరోజు ఢిల్లీలోనూ ఆ జట్టుపై ఆధిపత్యం కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈరోజు తుది జట్టులో మాత్రం మార్పులు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి.
భారత్ టీ20 జట్టు
బంగ్లాదేశ్‌ను గత ఆదివారం రాత్రి గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓడించిన భారత్ జట్టు.. బుధవారం (అక్టోబరు 9) ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లోనూ చిత్తు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం ఈరోజు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. సహజంగా స్పిన్‌కి అనుకూలించే ఈ పిచ్‌పై గత కొంతకాలంగా పరుగుల వరద పారుతోంది. దాంతో ఈరోజు మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
గ్వాలియర్ టీ20లో బంగ్లాదేశ్ బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆ జట్టు 0-2తో భారత్ జట్టుకి సిరీస్‌ను సమర్పించుకుంది. ఆ ఓటమి నుంచి బంగ్లాదేశ్ ఇంకా బయటపడినట్లు కనిపించడం లేదు. ఆ టీమ్‌లో దూకుడు, పట్టుదల కానరావడం లేదు. గ్వాలియర్ టీ20లో భారత్ జట్టుకి పూర్తి దాసోహమైనట్లు కనిపించింది.
టీమ్స్.. పిచ్ రికార్డులిలా
టీ20 రికార్డుల పరంగా చూసుకుంటే భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు 15 టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. బంగ్లాదేశ్ టీమ్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరిగా అక్కడ ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు జరిగాయి. ఆఖరిగా జరిగిన 10 మ్యాచ్‌లకిగానూ.. 8 ఇన్నింగ్స్‌ల్లో 200+ స్కోరు నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. దాంతో ఈరోజు కూడా భారీ స్కోరు ఖాయమే. మ్యాచ్ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానుంది.
భారత్ జట్టులో మార్పులు?
తొలి టీ20లో అలవోకగా గెలిచినప్పటికీ.. భారత్ తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో మరో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలానే పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను తీసుకోవడంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మయాంక్ యాదవ్‌కి రెస్ట్ ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యోచిస్తున్నాడు. తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన మయాంక్ యాదవ్.. 21 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మ్యాచ్‌లో సగటున 145కి.మీ వేగంతో మయాంక్ బంతులేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు.
బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి?
బంగ్లాదేశ్ టీమ్‌లో మార్పులు జరిగే సూచనలు కనిపించడం లేదు. అయితే బ్యార్లు మరింత బాధ్యతగా ఆడాలని మహ్మదుల్లా, లిట్టన్ దాస్ తదితర సీనియర్ బ్యాటర్లకి కెప్టెన్ శాంటో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహ్మదుల్లా మంగళవారం అనూహ్యంగా టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. భారత్‌తో ప్రస్తుతం ఆడుతున్న టీ20 సిరీస్ తన కెరీర్‌లో ఆఖరిదని తేల్చేశాడు. తొలి టీ20లో 2 బంతులాడిన మహ్మదుల్లా ఒక్క పరుగుకే ఔటైపోయాడు.
టాపిక్