Mohammed Shami: సానియా మీర్జాతో రెండో పెళ్లి - పుకార్లపై స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
20 July 2024, 12:11 IST
Mohammed Shami: ఇండియన్ మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పెళ్లిచేసుకోనున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ పెళ్లి వార్తలపై పేసర్ షమీ ఘాటుగా స్పందించాడు.
మహ్మద్ షమీ
Mohammed Shami: గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ టీమిండియాకు చాలా కాలంగా దూరంగా ఉంటోన్నాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో బౌలింగ్‌తో అదరగొట్టాడు షమీ. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా (24 వికెట్లు) టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కాలి మడమ గాయం కారణంగా వరల్డ్ కప్ తర్వాత జట్టులో కనిపించలేదు షమీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న షమీ నేషనల్ క్రికెట్ అకాడెమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
సానియా మీర్జాతో పెళ్లి...
కాగా ఇండియన్ మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షమీ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. సానియా మీర్జా ఈ ఏడాదే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడిపోయింది.
మరోవైపు షమీ కూడా భార్య హసీన్ జహాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు. షమీతో పాటు అతడి కుటుంబసభ్యులు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. ఈ గృహహింస కేసు నుంచి షమీకి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. హసీన్ ఆరోపణలు నిరాధారామని కొట్టిపడేసింది.
ఒంటరి జీవితానికి గుడ్‌బై...
త్వరలోనే ఒంటరి జీవితానికి గుడ్‌బై చెప్పి షమీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించాయి. సానియా మీర్జాను అతడు పెళ్లిచేసుకోవడం ఖాయమని ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న షమీ తొలిసారి నోరు విప్పాడు.
సోషల్ మీడియాలో మీమ్స్, గాసిప్స్ కోసమే కొందరు కావాలనే ఈ పెళ్లి పుకార్లను సృష్టించారని షమీ అన్నాడు. ఫన్ కోసమో, ఫేమస్ కావాలనో కొందరు ఫేక్ న్యూస్‌లను వ్యాప్తి చేస్తోన్నారని షమీ అన్నాడు. ఈ గాసిప్స్ ద్వారా తమను తామే దిగజార్చుకుంటున్నారనే విషయం మర్చిపోతున్నారని షమీ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
సరదా కోసం...
మీమ్స్, గాసిప్స్ సరదాగా ఉండాలి. అంతేకానీ అది మరొకరి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా, వారి గురించి అబద్ధాలను ప్రచారం చేసేలా ఉండకూడదు. అలాంటి న్యూస్‌ల పట్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించి పోస్ట్ చేస్తే మంచిది. ఊరు పేరు లేని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎవరి గురించైనా, ఏదైనా పోస్ట్ చేయచ్చనే భ్రమలో కొందరు ఉన్నారు. అలాంటి వారే నా పెళ్లి వార్తలను ప్రచారం చేశారు అని షమీ అన్నాడు.
అప్పడే సమాధానం చెబుతా...
దమ్ము, ధైర్యం ఉంటే వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ పెళ్లి వార్తలు నిజమో కాదో నన్ను అడగండి. అప్పుడే నా సమాధానం ఏమిటో చెబుతా అని షమీ ఫైర్ అయ్యాడు.
ప్రస్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో కఠిన సాధన చేస్తోన్నాడు. అయితే అతడి బౌలింగ్‌లో మునుపటి పదును, వైవిధ్యత రావడానికి మరికొద్ది రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది.