AP Cabinet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగింపుపై చర్చ, నేడు ఢిల్లీకి చంద్రబాబు
AP Cabinet: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మరో మూడు నాలుగు నెలలు పొడిగించడంతో పాటు, సంక్షేమ పథకాల అమలు కార్యాచరణపై చర్చించేందుకు ఏపీ క్యాబినెట్ నేడు భేటీ కానుంది.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నేడు జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతుంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు భేటీలో ఆమోదం తెలిపే అవకాశముంది.
గత ప్రభుత్వ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో దానిని మరో రెండు మూడు నెలలు పాటు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి 2-3 నెలల కాలానికి బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్, మాజీ ఐ అండ్ పిఆర్ కమిషనర్‌లపై విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన ఇసుక విధాన రూపకల్పనపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. కొత్త ఇసుక విధానాన్ని మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
భూకబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్టును తీసుకొచ్చే అంశంపై చర్చిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 22 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ బియ్యం అక్రమాలపై క్యాబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల ప్రస్తావించే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీకి చంద్రబాబు…
ఏపీ సిఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు.