తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz Pune Test: రెండో టెస్టు ముంగిట భారత్ జట్టుకి గుడ్‌ న్యూస్, న్యూజిలాండ్ బౌలర్లకి మళ్లీ చుక్కలే!

IND vs NZ Pune Test: రెండో టెస్టు ముంగిట భారత్ జట్టుకి గుడ్‌ న్యూస్, న్యూజిలాండ్ బౌలర్లకి మళ్లీ చుక్కలే!

Galeti Rajendra HT Telugu

22 October 2024, 11:47 IST

google News
  • Rishabh Pant Injury Update: న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్టులో ఓడిన భారత్ జట్టుకి గొప్ప ఉపశమనం ఇచ్చే వార్త. పుణె వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా పంత్ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ వచ్చింది. 

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (AFP)

రిషబ్ పంత్

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముంగిట భారత్ జట్టుకి గుడ్‌న్యూస్ వచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్ సాధించాడు. దాంతో అక్టోబరు 24 (గురువారం) నుంచి పుణెలో జరిగే రెండో టెస్టులో పంత్ ఆడటానికి లైన్ క్లియర్ అయ్యింది.

పంత్‌కి ఎలా గాయమైంది?

బెంగళూరు టెస్టులో స్పిన్నర్ రవీంద్ర జడేజా విసిరిన ఓ బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి వేగంగా వెళ్లి రిషబ్ పంత్ కాలికి తాకింది. ఆ ప్లేస్‌లోనే గత ఏడాది రిషబ్ పంత్‌కి సర్జరీ జరిగి ఉండటంతో.. బంతి తాకగానే నొప్పితో పంత్ మైదానంలోనే నొప్పితో విలవిలలాడిపోయాడు.

భారత్ జట్టు ఫిజియో వచ్చి సపర్యల తర్వాత మైదానం నుంచి పంత్‌ను నెమ్మదిగా వెలుపలికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత పంత్ కీపింగ్‌కి కూడా దూరమవగా.. అతని స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. బెంగళూరు టెస్టులో గాయపడిన రిషబ్ పంత్ పుణె టెస్టుకు ఫిట్‌గా ఉన్నాడనే వార్త వెలుగులోకి వచ్చింది.

గాయంతోనే కివీస్ బౌలర్లని దంచి

బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 105 బంతుల్లో 99 పరుగులు చేశాడు. కానీ.. బ్యాటింగ్ సమయంలో పంత్ అంత సౌకర్యంగా క్రీజులో కదులుతూ కనిపించలేదు. సింగిల్స్, డబుల్స్ తీయడం కంటే ఫోర్లు, సిక్సర్లు కొట్టడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో పంత్ 9 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. అంటే.. అతను చేసిన 99 పరుగుల్లో 66 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయాన్నమాట.

పుణె టెస్టులో రిషబ్ పంత్ ఆడితే మరోసారి న్యూజిలాండ్ బౌలర్లకి చుక్కలు తప్పవు. బెంగళూరు టెస్టులో సెంచరీ చేజారిన తర్వాత చాలా బాధపడుతూ కనిపించిన పంత్.. పుణె టెస్టులో మరింత కసిగా ఆడే అవకాశం ఉంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో సెంచరీ బాది ఫామ్ అందుకున్న పంత్.. పుణె టెస్టులోనూ కొనసాగిస్తే న్యూజిలాండ్ బౌలర్లకి తిప్పలే.

భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా గురువారం ఉదయం 9 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. పంత్ ఫిట్‌నెస్ సాధించడంతో ధృవ్ జురెల్ మరోసారి రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం