IND vs NZ: భారత్‌తో రెండో టెస్టుకీ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ దూరం, టెన్షన్‌లో పర్యాటక జట్టు
India vs New Zealand 2nd Test: బెంగళూరు టెస్టులో లక్కీగా గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. పుణె వేదికగా గురువారం నుంచి జరిగే టెస్టులోనూ జోరు కొనసాగించాలని ఆశిస్తోంది.
భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ టీమ్.. పుణె వేదికగా అక్టోబరు 24 (గురువారం) నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులోనూ అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తోంది. కానీ.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా రెండో టెస్టుకీ దూరమయ్యాడు.
గజ్జలో గాయం కారణంగా భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టుకి కేన్ విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. అయితే.. పుణె టెస్టుకి అతను అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ.. కేన్ ఇంకా న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా విలియమ్సన్ గాయపడ్డాడు. దాంతో ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్న కేన్ ప్రస్తుతం స్వదేశంలోనే ఉన్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఒక మీడియా ప్రకటనని విడుదల చేసింది. భారత్ పిచ్‌లపై మంచి అవగాహన ఉన్న కేన్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్‌కి గట్టి ఎదురుదెబ్బ.
కేన్ పరిస్థితి ఏంటి?
నవంబరు 1 నుంచి ముంబయిలోని వాంఖడే వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ టెస్టుకు విలియమ్సన్ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకుంటూ ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. అతను ఇంకా 100 శాతం ఫిట్‌గా మాత్రం ప్రస్తుతం లేడు. మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని.. తమని తాము మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసుకోవడానికి మేము వారికి వీలైనంత ఎక్కువ సమయం ఇస్తాము’’ అని గ్యారీ స్టెడ్ వెల్లడించాడు.
మూడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో గెలుపు రుచి చూసిన న్యూజిలాండ్ టీమ్.. పుణె టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. బెంగళూరు టెస్టులో భారత్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. 8 వికెట్ల తేడాతో గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.