Kapil Show OTT: రన్నరప్, విన్నర్.. కపిల్ శర్మకు పంచ్ వేసిన రోహిత్.. కెప్టెన్‍ను గజిని అన్న సూర్య: చూసేయండి
02 October 2024, 15:17 IST
- The Great India Kapil Show OTT - Rohit Sharma: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ సహా మరో ముగ్గురు యంగ్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో నేడు వచ్చింది. ఇది చాలా సరదాగా సాగింది.
Kapil Show OTT: రన్నరప్, విన్నర్.. కపిల్ శర్మకు పంచ్ వేసిన రోహిత్.. కెప్టెన్‍ను గజిని అన్న సూర్య: చూసేయండి
‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో టీమిండియా క్రికెటర్లు సందడి చేశారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆటగాళ్లు అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, శివం దూబే ఈ కామెడీ టాక్ షోకు హాజరయ్యారు. ఈ షోకు రోహిత్ రావడం ఇది రెండోసారిగా ఉంది. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నేడు (అక్టోబర్ 2) తీసుకొచ్చింది. ప్రోమో ఆకట్టుకునేలా ఉంది.
కపిల్‍కు రోహిత్ పంచ్
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍ను రోహిత్ సారథ్యంలో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రోహిత్, సూర్య, దూబే, అర్షదీప్, అక్షర్ పాల్గొన్న ఈ ఎపిసోడ్‍కు క్రికెట్ ఛాంపియన్స్ అంటూ నెట్‍ఫ్లిక్స్ తీసుకొస్తోంది.
కపిల్ శర్మకు రోహిత్ పంచ్ వేయడంతో ఈ ప్రోమో మొదలైంది. “ఫస్ట్ సీజన్‍కు వచ్చినప్పుడు ప్రపంచకప్ (వన్డే)లో రన్నరప్‍గా ఉన్నారు. ఈసారి వరల్డ్ కప్ గెలిచి వచ్చారు. మేం మీకు లక్కీ అని అంగీకరిస్తారా?” అని రోహిత్‍తో కపిల్ అన్నారు. దీనికి తన స్టైల్‍లో రిప్లై ఇచ్చారు హిట్‍మ్యాన్. “నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ షో నంబర్ వన్ అయింది” అని రోహిత్ శర్మ రివర్స్ పంచ్ వేశాడు.
ఆ తర్వాత ఆటగాళ్ల పేర్లను చూపించి యాక్టింగ్ చేసే కనుగొనే ఆటను ఆడారు. ఇది బాగా సరదాగా ఉండేలా ఉంది. చెత్త యాక్టింగ్ అంటూ రోహిత్ అన్నారు.
అంత ప్రేమతో చెప్పలేదు
టీ20 ప్రపంచకప్ గెలిచాక ఎవరు ఎక్కువ పార్టీ చేసుకున్నారని కపిల్ శర్మ అడిగారు. “ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు అని గట్టిగా చెప్పా. దొరికినప్పుడు ఉపయోగించుకోండని చెప్పా” అని రోహిత్ అన్నారు. మధ్యలో సూర్య కుమార్ కల్పించుకున్నారు. ఫోన్‍లో ఇంత ప్రేమగా ఏం చెప్పలేదని చెప్పారు. దీంతో దూబే, అక్షర్ గట్టిగా నవ్వారు. స్కిట్ చేసేందుకు చెఫ్ అవతారంలో వచ్చిన అమ్మాయి ఏదైనా అడగాలని చెబితే.. అర్షదీప్ పంచ్ వేశాడు. ప్రేమతో ఏమిచ్చినా తీసుకుంటానని అన్నాడు.
రోహిత్ శర్మ ‘గజినీ’
గజినీ ఎవరు అని అనగానే రోహిత్ శర్మనే అంటూ కళ్లుతోనే సైగ చేశాడు సూర్యకుమార్ యాదవ్. దీంతో అరే అంటూ రోహిత్ చేతిని ముఖానికి అడ్డుపెట్టున్నాడు. “‘టాస్ సమయంలో పేర్లు మరిచిపోతాడు” అని రోహిత్ గురించి దూబే చెప్పాడు. “పేర్లు మరిచిపోడు.. ఏకంగా కాయినే మర్చిపోతాడు” అంటూ సూర్యకుమార్ జోక్ చేశాడు. మొత్తంగా ఈ ప్రోమో సరదాగా కామెడీతో సాగింది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
రోహిత్ శర్మ, సూర్యకుమార్, దూబే, అర్షదీప్, అక్షర్ పాల్గొన్న ఈ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సిరీస్ ఈ శనివారం అక్టోబర్ 5వ తేదీన రాత్రి 8 గంటలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్‍ను భారత్ దక్కించుకుంది. 17ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‍ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీ తర్వాత భారత్ తరఫున టీ20లకు రోహిత్ శర్మ గుడ్‍బై చెప్పాడు. వన్డే, టెస్టులకు కెప్టెన్‍గా కొనసాగుతున్నాడు. భారత టీ20 జట్టుకు సూర్య కెప్టెన్ అయ్యాడు. రోహిత్ సారథ్యంలో తాజాగా బంగ్లాదేశ్‍ను 2-0తో టెస్టు సిరీస్‍లో క్లీన్‍స్వీప్ చేసింది భారత్. అక్టోబర్ 6 నుంచి బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ మొదలుకానుంది.