Ricky Ponting: అవును.. నన్ను అడిగారు.. కానీ: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
23 May 2024, 16:39 IST
- Ricky Ponting: టీమిండియా హెచ్ కోచ్ పదవి కోసం తనను సంప్రదించినట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కానీ ఆ పదవిపై తాను ఆసక్తి చూపలేదని అతడు వెల్లడించాడు.
అవును.. నన్ను అడిగారు.. కానీ: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
Ricky Ponting: టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎవరికి దక్కుతుంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను కూడా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు పాంటింగే ఈ విషయాన్ని ధృవీకరించాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఆ బాధ్యతలు తాను చేపట్టాలని బీసీసీఐ తనను సంప్రదించినట్లు వెల్లడించాడు.
నన్ను అడిగారు కానీ..: పాంటింగ్
ఐసీసీతో మాట్లాడిన రికీ పాంటింగ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్ రావడం, తాను దానిని తిరస్కరించడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. "దీని గురించి చాలా రిపోర్టులు నేను చూశాను. సాధారణంగా మనకు తెలియకుండానే ఈ విషయాలు సోషల్ మీడియాలో వచ్చేస్తుంటాయి. కానీ ఐపీఎల్ సందర్భంగా ఈ పదవిపై నాకున్న ఆసక్తి గురించి తెలుసుకోవడానికి నన్ను సంప్రదించారు" అని పాంటింగ్ తెలిపాడు.
మరి ఈ పదవిని అతడు ఎందుకు నిరాకరించాడు? దీనికి ఐపీఎల్ ఒక కారణం కాగా.. మరొకటి కుటుంబానికి దూరంగా ఉంటూ ఏడాదంతా దేశ, విదేశాలు తిరగాల్సి రావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రికీ పాంటింగ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆ పదవి వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడు.
హెడ్ కోచ్ వద్దనుకోవడానికి ఇదే కారణం
"ఓ నేషనల్ టీమ్ కు సీనియర్ కోచ్ గా ఉండటం నాకు ఇష్టమే. కానీ నా జీవితంలో కొన్ని ఇతర విషయాలు, కుటుంబంతో కాస్త సమయం గడపాలని అనుకోవడం.. ఇక ప్రతి ఒక్కరికీ తెలుసు.. ఇండియన్ టీమ్ తో పని చేస్తే ఐపీఎల్ టీమ్ తో చేయకూడదు.
అందువల్ల అది కూడా పోతుంది. అంతేకాదు ఓ నేషనల్ కోచ్ ఏడాదికి 10 నుంచి 11 నెలల పాటు ప్రయాణిస్తూనే ఉండాలి. నా లైఫ్ స్టైల్ కు ఇది అస్సలు సెట్ కాదు" అని పాంటింగ్ అన్నాడు.
రేసులో ఆ ముగ్గురూ..
ప్రస్తుతం టీమిండియా హెచ్ కోచ్ రేసులో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ రేసులో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ 2024తో ప్రస్తుత హెడ్ కోచ్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తున్న విషయం తెలిసిందే.
రేసులో ఉన్న ముగ్గురూ ప్రస్తుతం ఐపీఎల్ టీమ్స్ తో ఉన్నారు. గంభీర్ కేకేఆర్ మెంటార్ గా, లాంగర్ లక్నో హెడ్ కోచ్ గా, ఫ్లెమింగ్ సీఎస్కే హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ డైరెక్టర్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపైనా పాంటింగ్ స్పందించాడు. "మరికొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుసు. లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఉన్నారు. గంభీర్ పేరును కూడా రెండు రోజుల కిందట తెరపైకి తెచ్చారు. కానీ నాకు ఆఫర్ ఇచ్చినంత మాత్రాన నేను కావడం అనేది జరిగే అవకాశం లేదు" అని పాంటింగ్ స్పష్టం చేశాడు.
టాపిక్