T20 World Cup 2024: పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి టీ20 వరల్డ్ కప్‌కు పొంచి ఉన్న ముప్పు.. ఐసీసీ ప్లాన్ ఇదీ
T20 World Cup 2024: పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి టీ20 వరల్డ్ కప్ 2024కు ముప్పు వాటిల్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రికెట్ వెస్టిండీస్, ఐసీసీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నాయి.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ ఈసారి వెస్టిండీస్, అమెరికాల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఉత్తర పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల నుంచి ఈ టోర్నీకి ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఉగ్రవాదుల ముప్పు
టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ ఈసారి జరగనున్న విషయం తెలిసిందే. సాధారణంగా క్రికెట్ టోర్నీలంటే భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి వస్తున్న బెదిరింపు నేపథ్యంలో దీనిని మరింత కట్టుదిట్ట చేయనున్నారు. తమ దగ్గర జరగబోయే స్పోర్టింగ్ ఈవెంట్లపై ఇస్లామిక్ స్టేట్ అనుకూల ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్లు కరీబియన్ మీడియా తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ బ్రాంచ్ నుంచి ఇప్పటికే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ దాడులకు ప్లాన్ చేస్తూ ఆయా దేశాల్లోని తమ అనుచరులు తమతో చేరాలని పిలుపునిచ్చింది. దీంతో క్రికెట్ వెస్టిండీస్, ఐసీసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
భద్రతపై క్రికెట్ వెస్టిండీస్ దృష్టి
ఈ ఉగ్రవాద దాడుల ముప్పు నేపథ్యంలో క్రికెట్ వెస్టిండీస్ అభిమానులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ దీనిపై స్పందిస్తూ.. భద్రతే తమ మొదట ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి ముప్పులను ఎదుర్కోవడానికి తమ దగ్గర ఓ సమగ్రమైన, పరిపూర్ణమైన భద్రతా ప్రణాళిక ఉన్నదని క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు.
ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొనేందుకు ది కరీబియన్ కమ్యూనిటీ, స్థానిక భద్రతా ఏజెన్సీలు కలిసి పని చేస్తున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్న కరీబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్ తోపాటు ఇతర ఆతిథ్య దేశాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీ కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ టూసియా, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో జరగనుంది.
దీనికితోడు అమెరికాలోని ఫ్లోరియా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాలు కూడా కొన్ని మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్నాయి. తొలిసారి అమెరికాలో ఇంతటి మెగా క్రికెట్ టోర్నీ జరగనుండటంతో ఐసీసీ ఈ ముప్పు అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనే ప్లేయర్స్, సిబ్బంది, ప్రేక్షకులందరికీ సురక్షితమైన, విజయవంతమైన వరల్డ్ కప్ అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఈసారి ఎన్నడూ లేని విధంగా 20 జట్లు టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి. వాటిలో ఇండియా, పాకిస్థాన్ మధ్య కూడా కీలకమైన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ లో ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.