Ashwin 100th Test: వందో టెస్ట్ ఆడబోతున్న అశ్విన్.. ఇప్పటి వరకూ ఈ ఘనత సాధించిన ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే
05 March 2024, 14:13 IST
- Ashwin 100th Test: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్లో వందో టెస్ట్ ఆడబోతున్నాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత క్రికెటర్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ ఘనత సాధించిన ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
టీమిండియా తరఫున 100వ టెస్ట్ ఆడబోతున్న 14వ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్
Ashwin 100th Test: రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సొంతం చేసుకోబోతున్నాడు. ఈ మధ్యే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న అశ్విన్.. ఇప్పుడు ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరగనున్న ఐదో టెస్టుతో వందో టెస్ట్ మైలురాయిని అందుకోనున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన 14వ భారత ప్లేయర్ గా అశ్విన్ నిలవనున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు.
ఈ ప్రయాణం ప్రత్యేకమైంది: అశ్విన్
ధర్మశాల మైల్‌స్టోన్ టెస్టుకు ముందు మంగళవారం (మార్చి 5) ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా గమ్యం కంటే కూడా ప్రయాణమే చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాడు. "ఇది చాలా పెద్ద సందర్భం. గమ్యం కంటే కూడా ప్రయాణం చాలా ప్రత్యేకం. 100వ టెస్ట్ నాకు చాలా ప్రాధాన్యమైనది.
కానీ నా కంటే కూడా మా నాన్న, అమ్మ, భార్య, పిల్లలకు కూడా చాలా ముఖ్యమైనది. ఈ టెస్టు కోసం నా పిల్లలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఓ ప్లేయర్ ప్రయాణంలో వాళ్ల కుటుంబాలు ఎన్నో పరిస్థితులను అనుభవిస్తాయి. ఓ మ్యాచ్ సందర్భంగా తన కొడుకు ఆడిన తీరుపై మా నాన్న ఇప్పటికే 40 ఫోన్లు మాట్లాడుతుంటారు" అని అశ్విన్ చెప్పాడు.
ధర్మశాలలోని చల్లటి వాతావరణంలో ఆడటంపై కూడా అశ్విన్ స్పందించాడు. తాను 21 ఏళ్ల కిందట ఇక్కడ రెండు నెలల పాటు అండర్ 19 క్రికెట్ ఆడానని, చాలా చల్లగా ఉండటంతో వేళ్లు అడ్జెస్ట్ కావడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. అశ్విన్ ఈ మధ్యే రాజ్‌కోట్ టెస్టులో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
100 టెస్టులు ఆడిన ఇండియన్ ప్లేయర్స్
సచిన్ టెండూల్కర్ - 200 టెస్టులు
రాహుల్ ద్రవిడ్ - 163 టెస్టులు
వీవీఎస్ లక్ష్మణ్ - 134 టెస్టులు
అనిల్ కుంబ్లే - 132 టెస్టులు
కపిల్ దేవ్ - 131 టెస్టులు
సునీల్ గవాస్కర్ - 125 టెస్టులు
దిలీప్ వెంగ్‌సర్కార్ - 116 టెస్టులు
సౌరవ్ గంగూలీ - 113 టెస్టులు
విరాట్ కోహ్లి - 113 టెస్టులు
ఇషాంత్ శర్మ - 105 టెస్టులు
హర్భజన్ సింగ్ - 103 టెస్టులు
చెతేశ్వర్ పుజారా -103 టెస్టులు
వీరేంద్ర సెహ్వాగ్ - 103 టెస్టులు
ధర్మశాల టెస్ట్
ఇండియా, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదోటెస్టు గురువారం (మార్చి 7) నుంచి ధర్మశాలలో ప్రారంభం కానుంది. ఇది అశ్విన్ కు మాత్రమే కాదు ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోకి కూడా 100వ టెస్ట్ కానుంది. అయితే ఈ సిరీస్ లో అతడు ఫామ్ లో లేకపోవడంతో చివరి టెస్టులో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే నాలుగు టెస్టులు జరగగా.. ఇండియా 3-1తో సిరీస్ గెలుచుకుంది. చివరి టెస్టులో గెలిచి సిరీస్ ను 4-1తో ఘనంగా గెలవడంతోపాటు 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది.