Ravichandran Ashwin 500 Wickets: టెస్టుల్లో అశ్విన్ 500 వికెట్లు.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్
Ravichandran Ashwin 500 Wickets: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు.
Ravichandran Ashwin 500 Wickets: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ తీశాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఇండియన్ బౌలర్ గా అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్ గా 500 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో వేగవంతమైన బౌలర్ గా నిలిచాడు.
అశ్విన్ అరుదైన రికార్డు
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీ (15)ని ఔట్ చేసి టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. నిజానికి ఇంగ్లండ్ తో రెండో టెస్టులోనే ఈ ఘనత సాధిస్తాడని భావించినా.. అక్కడ 499 వికెట్ల దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు రాజ్‌కోట్ టెస్ట్ రెండో రోజు ఇంగ్లండ్ తొలి వికెట్ తీసి ఆ ఘనతను దక్కించుకున్నాడు.
ఆడిన మ్యాచ్ లు, వేసిన బంతుల పరంగా 500వ వికెట్ ను అత్యంత వేగంగా అందుకున్న రెండో బౌలర్ అశ్విన్. శ్రీలంక స్పిన్నర్ తన 87వ టెస్టులో ఈ 500 వికెట్లు మైలురాయిని అందుకోగా.. అశ్విన్ 98వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఇక బంతుల పరంగా చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ 25528వ బంతికి 500వ వికెట్ తీశాడు. అశ్విన్ 25715వ బంతికి ఈ మైలురాయిని అందుకున్నాడు.
అప్పుడు చంద్రశేఖర్.. ఇప్పుడు కుంబ్లే..
ఇక ఇండియా తరఫున అనిల్ కుంబ్లే 105వ టెస్టులో ఈ రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు అశ్విన్ దానిని బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టులోనే ఆ టీమ్ పై ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఇంతకుముందు బీఎస్ చంద్రశేఖర్ పేరు మీద 96 వికెట్లతో ఉన్న రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ పై అశ్విన్ వికెట్ల సంఖ్య 98కి చేరింది.
టెస్టు క్రికెట్ లో 500 వికెట్ల మైలురాయి అందుకున్న 9వ బౌలర్ అశ్విన్. 37 ఏళ్ల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు. ఇక ఇండియా తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్నాడు. కుంబ్లే 132 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో ఓవరాల్ గా శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ 133 మ్యాచ్ లలో 800 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ బ్యాట్ తోనూ రాణించాడు. రెండో రోజు అతడు 37 పరుగులు చేశాడు. ధృవ్ జురెల్ తో కలిసి అతడు 8వ వికెట్ కు 77 పరుగులు జోడించడంతో టీమిండియా స్కోరు 400 దాటింది. టెస్టుల్లో దశాబ్దానికిపైగా ఇండియన్ టీమ్ కు నమ్మదగిన ఆల్ రౌండర్ గా అశ్విన్ ఎదిగాడు. ఇప్పటికీ లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తో రాణిస్తూనే ఉన్నాడు.