McGrath on Bumrah: నేను బుమ్రాకు పెద్ద అభిమానిని.. కానీ..: మెక్‌గ్రాత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-cricket news mcgrath says he is big fan of bumrah ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cricket News Mcgrath Says He Is Big Fan Of Bumrah

McGrath on Bumrah: నేను బుమ్రాకు పెద్ద అభిమానిని.. కానీ..: మెక్‌గ్రాత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Aug 04, 2023 03:55 PM IST

McGrath on Bumrah: నేను బుమ్రాకు పెద్ద అభిమానిని కానీ అంటూ టీమిండియా స్టార్ పేస్ బౌలర్ పై ఆస్ట్రేలియా లెజెండరీ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గ్లెన్ మెక్‌గ్రాత్, బుమ్రా
గ్లెన్ మెక్‌గ్రాత్, బుమ్రా (Getty Images)

McGrath on Bumrah: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి క్రికెట్ ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అతనికి అయిన తీవ్ర వెన్ను గాయం, దాని నుంచి కోలుకోవడానికి తీసుకుంటున్న సమయం, ఈ గాయానికి కారణమైన అతని బౌలింగ్ యాక్షన్ పై క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా బుమ్రాపై స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

తాను బుమ్రాకు వీరాభిమానినని, కానీ అతని బౌలింగ్ యాక్షన్ కఠినమైనది కాబట్టి బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యమని మెక్‌గ్రాత్ అన్నాడు. తన శరీరాన్ని కాపాడుకోవడంతోపాటు పనిభారంపై కూడా బుమ్రా దృష్టిసారించాలని, అలా అయితేనే అతడు మరికొన్నేళ్లు క్రికెట్ లో కొనసాగుతాడని అతడు స్పష్టం చేశాడు.

"ఇండియా తరఫున బుమ్రా అద్భుతంగా ఆడుతున్నాడు. అతని బౌలింగ్ గణాంకాలు, అతడు తీసుకున్న వికెట్లు, అతడు బౌలింగ్ చేసే తీరుకు నేను పెద్ద అభిమానిని. కానీ అతని బౌలింగ్ యాక్షన్ తన శరీరంపై చాలా ఒత్తిడి కలిగిస్తోంది. అందువల్ల అతడు చాలా స్ట్రాంగా, ఫిట్‌గా ఉండాలి. ఆ పని చేస్తే అతడు మరికొన్నేళ్లు ఆడగలడు" అని మెక్‌గ్రాత్ అన్నాడు.

ఎమ్మారెఫ్ పేస్ ఫౌండేషన్ నిర్వహించిన పేస్ బౌలింగ్ క్యాంప్ లో పాల్గొన్న మెక్‌గ్రాత్ ఈ కామెంట్స్ చేశాడు. "ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, ఐపీఎల్ కారణంగా ఓ పేస్ బౌలర్ ఆఫ్ సీజన్ అంటూ ఏదీ లేదు. బుమ్రాలాంటి బౌలర్ కు కచ్చితంగా కాస్త విరామం ఉండాలి. అందువల్ల ఆ నిర్ణయం అతడే తీసుకోవాలి. మూడు ఫార్మాట్లూ ఆడటం కష్టమవుతోంది. బుమ్రా బౌలింగ్ ప్రత్యేకం. కానీ అదే అతని శరీరానికి కష్టంగా మారుతోంది. అందుకే దీనిపై బుమ్రానే నిర్ణయం తీసుకోవాలి. అతడు తన కెరీర్లో ఇంకా చాలా చేస్తాడని భావిస్తున్నా" అని మెక్‌గ్రాత్ అన్నాడు.

బ్రాడ్, ఆండర్సన్‌ను చూసి నేర్చుకోవాలి

ఈ సందర్భంగా ఇంగ్లండ్ వెటరన్ బౌలర్లు బ్రాడ్, ఆండర్సన్ ల గురించి మెక్‌గ్రాత్ ప్రస్తావించాడు. మెక్‌గ్రాత్ తన 14 ఏళ్ల కెరీర్లో లేనన్ని గాయాలు బుమ్రాకు ఏడేళ్లలోనే అయ్యాయి. ఈ కాలం బిజీ క్రికెట్ కు తగినట్లుపేస్ బౌలర్లు తమ ఫిట్‌నెస్ పై చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

"ఈ రోజుల్లో చాలా క్రికెట్ ఆడుతున్నారు. అది శరీరంపై ఒత్తిడి కలిగిస్తుంది. కానీ దాని నుంచి ఎలా కోలుకోవాలి, శరీరాన్ని మళ్లీ ఎలా గాడిలో పెట్టాలన్నది తెలిసి ఉండాలి. ఆండర్సన్, బ్రాడ్, వాల్ష్ లాంటి బౌలర్లు తమ శరీరాలను ఎలా గాడిలో పెట్టాలో తెలుసు కాబట్టే అంతకాలం పాటు ఆడారు. నేను నా ఫిట్‌నెస్ పై చాలా శ్రమించాను. నా బౌలింగ్ యాక్షన్ ఈజీ కాబట్టి గాయం నుంచి కోలుకోవడం కూడా సులువే" అని మెక్‌గ్రాత్ అన్నాడు.

WhatsApp channel