Anil Kumble vs Pakistan: పాకిస్థాన్ పని పట్టిన అనిల్ కుంబ్లే.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లకు 25 ఏళ్లు.. ఆ వీడియో ఇదే-anil kumble 10 wickets in an innings against pakistan 25 years to that unbelievable feat cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Anil Kumble Vs Pakistan: పాకిస్థాన్ పని పట్టిన అనిల్ కుంబ్లే.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లకు 25 ఏళ్లు.. ఆ వీడియో ఇదే

Anil Kumble vs Pakistan: పాకిస్థాన్ పని పట్టిన అనిల్ కుంబ్లే.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లకు 25 ఏళ్లు.. ఆ వీడియో ఇదే

Hari Prasad S HT Telugu
Feb 07, 2024 02:20 PM IST

Anil Kumble vs Pakistan: టీమిండియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసుకున్న చారిత్రక ఘటనకు 25 ఏళ్లు నిండాయి. 1999లో సరిగ్గా ఇదే రోజు (ఫిబ్రవరి 7) పాక్ టీమ్ పని పట్టాడు.

పాకిస్థాన్ పై 1999లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే
పాకిస్థాన్ పై 1999లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీసుకున్న అనిల్ కుంబ్లే (screen grab BCCI X Account)

Anil Kumble vs Pakistan: క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు ఒకే బౌలర్ తీసుకున్న సందర్భాలు మూడు మాత్రమే. అందులో ఒకరు మన టీమిండియా లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లేనే కావడం విశేషం.

అది కూడా దాయాది పాకిస్థాన్ పై ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సరిగ్గా 25 ఏళ్ల కిందట జరిగిన ఈ అద్భుతాన్ని బీసీసీఐ మరోసారి క్రికెట్ అభిమానులకు గుర్తు చేసింది.

పాకిస్థాన్ పని పట్టిన కుంబ్లే

1999, ఫిబ్రవరి 7.. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం.. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 101 రన్స్ చేసింది. టీమిండియా అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ సమయంలో అనిల్ కుంబ్లే ఎవరూ ఊహించని అద్భుతం చేశాడు. ఒకటీ, రెండు కాదు.. ఆ ఇన్నింగ్స్ మొత్తం 10 పాకిస్థాన్ వికెట్లు తీసి ఇండియన్ టీమ్ కు అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాడు.

సరిగ్గా 25 ఏళ్ల కిందట ఈ అద్భుతం జరగగా.. బుధవారం (ఫిబ్రవరి 7) బీసీసీఐ దానికి సంబంధించిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. "1999లో ఇదే రోజు.. టీమిండియా స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్, ఓవరాల్ గా రెండో బౌలర్ గా చరిత్రలో నిలిచాడు. ఆ వికెట్లను మరోసారి చూడండి" అంటూ బీసీసీఐ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఆ వీడియో పోస్ట్ చేసింది.

కుంబ్లే స్పిన్ మ్యాజిక్

లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కంటే ముందు 1956లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ కూడా ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీశాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా అతడు నిలిచాడు. 43 ఏళ్ల తర్వాత కుంబ్లే ఆ రికార్డు రిపీట్ చేయగా.. 2021, డిసెంబర్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా ఇండియాపైనే ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీశాడు.

1999లో జరిగిన ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ పై కుంబ్లే ఈ రికార్డు సాధించడం అభిమానులకు మరింత మరుపురానిదిగా మిగిలిపోయింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనూ అతడు 4 వికెట్లు తీయడంతో ఇండియాకు 80 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో గంగూలీ, సదగోపన్ రమేష్ హాఫ్ సెంచరీలతో పాక్ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిది 24.2 ఓవర్లలోనే 101 పరుగులు జోడించి పాక్ ను లక్ష్యం వైపు తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో అఫ్రిది వికెట్ తీసిన కుంబ్లే.. అక్కడి నుంచి పాక్ ఇన్నింగ్స్ కు పేకమేడలా కుప్పకూల్చాడు. ఒక్కసారిగా పాక్ 128 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివరికి 207 రన్స్ కు ఆలౌటై.. 212 పరుగులతో ఓడిపోయింది. అనిల్ కుంబ్లే 26.3 ఓవర్లలో 74 రన్స్ ఇచ్చి పదికి పది వికెట్లు తీశాడు.

Whats_app_banner