IND vs BAN 1st Test Highlights: చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్‌ను చెడుగుడు ఆడేసిన భారత్.. 4 రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
22 September 2024, 11:50 IST
Chennai Test Highlights: పాకిస్థాన్ జట్టుకి దాని సొంతగడ్డపైనే ఓటమి రుచి చూపి గర్వంతో భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌ను చెపాక్ టెస్టులో భారత్ జట్టు చిత్తు చిత్తుగా ఓడించేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలోనూ టీమిండియాకి కనీస పోటీని కూడా బంగ్లాదేశ్ ఇవ్వలేకపోయింది.
భారత టెస్టు జట్టు
India vs Bangladesh 1st Test Highlights: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు అలవోక విజయాన్ని అందుకుంది. 515 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్.. ఈరోజు తొలి సెషన్‌లోనే 234 పరుగులకి కుప్పకూలిపోయింది. దాంతో 280 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది.
అశ్విన్‌కి 6 వికెట్లు
మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 158/4తో ఛేదనను కొనసాగించిన బంగ్లాదేశ్ టీమ్.. తొలి సెషన్‌లోనే స్పిన్నర్ అశ్విన్ (6/88) దెబ్బకి 234 పరుగులకే చేతులెత్తేసింది. చెపాక్ టెస్టు విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.
గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా.. రవిచంద్రన్ అశ్విన్ (113: 133 బంతుల్లో 11x4, 2x6), రవీంద్ర జడేజా (86: 124 బంతుల్లో 10x4, 2x6) దూకుడుగా ఆడటంతో భారత్ 376 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్మద్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
4 రోజులు ఆట సాగిందిలా
బంగ్లాదేశ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టులో షకీబ్ అల్ హసన్ మాత్రమే 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. దాంతో 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌ను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ (119 నాటౌట్: 176 బంతుల్లో 10x4, 4x6), రిషబ్ పంత్ (109: 128 బంతుల్లో 13x4, 4x6) సెంచరీలు బాదేశారు. దాంతో శనివారం 287/4 వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 227 పరుగుల్ని కలుపుకుని ఓవరాల్‌గా 515 పరుగుల లక్ష్యం బంగ్లాదేశ్ ముందు టీమిండియా నిలిపింది.
బంగ్లా పతనాన్ని శాసించిన అశ్విన్
భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఆరంభం నుంచే తడబడింది. ఆ జట్టు కెప్టెన్ శాంటో (82: 127 బంతుల్లో 8x4, 3x6) క్రీజులో చాలా సేపు ఉండి హాఫ్ సెంచరీతో ఆ జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ.. అతనికి టీమ్ నుంచి సహకారం కరువైంది. దాంతో బంగ్లాదేశ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌటైంది. భారత్ జట్టులో స్పిన్నర్ అశ్విన్ బ్యాటింగ్‌లో సెంచరీ, బౌలింగ్‌లో 6 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు.
నెలలోనే ఎంత మార్పు?
సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే బంగ్లాదేశ్ టెస్టు టీమ్.. పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే చిత్తుగా ఓడించేసింది. రావల్పిండిలో జరిగిన రెండు టెస్టుల్లోనూ 10 వికెట్లు, 6 వికెట్ల తేడాతో ఘన విజయాల్ని నమోదు చేసి.. పాకిస్థాన్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను ముద్దాడింది. దాంతో భారత్ గడ్డపైకి ఒకింత గర్వంతోనే బంగ్లాదేశ్ అడుగుపెట్టింది. కానీ.. తొలి టెస్టులోనే ఆ జట్టుకి ఆ గర్వమంతా టీమిండియా అణిచివేసింది.
టాపిక్