Preity Zinta: నెక్స్ట్ ఐపీఎల్‌లో పంజాబ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ? - పుకార్లపై ప్రీతి జింటా క్లారిటీ
20 April 2024, 10:36 IST
Preity Zinta: ఐపీఎల్ నెక్స్ట్ సీజన్‌లో ధావన్ స్థానంలో రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై ప్రీతి జింటా ఏమన్నదంటే?
ప్రీతి జింటా
Preity Zinta: ఈ ఏడాది ముంబై కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మ వదులుకున్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు ముంబైకి టైటిల్‌ను అందించిన రోహిత్‌ను కాదని హార్దిక్ పాండ్యకు ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ చాలా హర్ట్ అయినట్లు ముంబై జట్టును వీడనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో ముంబై తరఫున ఇదే అతడికి చివరి సీజన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే చివరి సీజన్...
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో రోహిత్‌ను కొనేందుకు పంజాబ్, గుజరాత్‌తో పాటు ఇతర ఫ్రాంచైజ్‌లు రెడీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రోహిత్‌ను వేలంలో దక్కించుకునేందుకు ప్రీతీ జింటా తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తోన్నాయి.
రోహిత్ లాంటి జట్టును సమర్థవంతంగా ముందు నడిపించే కెప్టెన్ తమ టీమ్‌లో లేడంటూ ప్రీతి జింటా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. రోహిత్ శర్మ వేలంలోకి వస్తే అతడి కోసం తన జీవితాన్ని కూడా పందెంగా వేయడానికి సిద్ధమంటూ ప్రీతి జింటా వ్యాఖ్యానించిందంటూ కథనాలు వెలువడుతోన్నాయి.
ధావన్‌ను తప్పించడం ఖాయమే?
ప్రీతి జింటా వ్యాఖ్యలతో రోహిత్ ముంబై వీడనుంది నిజమేనంటూ అతడి అభిమానులు చెబుతోన్నారు. నెక్స్ట్ సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను తప్పించడం ఖాయమేనని పుకార్లు షికారు చేస్తున్నాయి.
పుకార్లపై క్లారిటీ...
ఎట్టకేలకు ఈ పుకార్లపై ట్విట్టర్ ద్వారా ప్రీతి జింటా క్లారిటీ ఇచ్చింది. రోహిత్‌ను ఐపీఎల్ వేలంలో తాను దక్కించుకోవడాకి సిద్ధమంటూ కామెంట్స్ చేసినట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని అన్నది. రోహిత్ గురించి తాను ఏ ఇంటర్వ్యూలో ఎలాంటి కామెంట్స్ చేయలేదని, ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని ప్రీతి జింటా వెల్లడించింది. రోహిత్ వీరాభిమానుల్లో తాను ఒకరినని, అతడి ఆటతీరు అంటే చాలా ఇష్టమని ప్రీతి జింటా తెలిపింది.
ధావన్‌పై నమ్మకం...గౌరవం...
కెప్టెన్‌గా, ఆటగాడి శిఖర్ ధావన్‌పై నమ్మకం, గౌరవం ఉన్నాయని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. ధావన్ గాయంతోజట్టుకు దూరమైన తరుణంలో ఇలాంటి పుకార్లను సృష్టించగం తగదని, ఈ నిరాధారమైన కథనాలు జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ప్రీతి జింటా తెలిపింది.
కెప్టెన్సీ పరంగా పంజాబ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో టీమ్ పటిష్టంగా ఉందని ప్రీతి జింటా అన్నది. తదుపరి మ్యాచుల్లో గెలవడంపై తాము దృష్టిసారించినట్లు తెలిసింది. ప్రీతి జింటా పోస్ట్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
పాయింట్ల పట్టికలో చివరి నుంచి సెకండ్ ప్లేస్...
ఈ ఐపీఎల్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శిఖర్ ధావన్ భుజం గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సామ్‌కరణ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. సామ్ కరణ్ కెప్టెన్సీలో పంజాబ్ ఒక్క విజయం సాధించలేదు.
ఈ ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ రెండింటిలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ గొప్పగా పోరాడుతోన్న మిగిలిన ప్లేయర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో పంజాబ్ గత ఐదు మ్యాచుల్లో విజయం ముంగిట బోల్తా పడింది.