IPL 2024: వైస్ కెప్టెన్‌ను కాద‌ని మ‌రో క్రికెట‌ర్‌కు కెప్టెన్సీ - ఐపీఎల్‌లో ఇలా ఎన్నిసార్లు జ‌రిగిందంటే?-jitesh sharma to bhuvneshwar kumar captaincy handed over to a cricketer other than the vice captain in ipl ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: వైస్ కెప్టెన్‌ను కాద‌ని మ‌రో క్రికెట‌ర్‌కు కెప్టెన్సీ - ఐపీఎల్‌లో ఇలా ఎన్నిసార్లు జ‌రిగిందంటే?

IPL 2024: వైస్ కెప్టెన్‌ను కాద‌ని మ‌రో క్రికెట‌ర్‌కు కెప్టెన్సీ - ఐపీఎల్‌లో ఇలా ఎన్నిసార్లు జ‌రిగిందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2024 03:49 PM IST

IPL 2024: రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ భుజం గాయంతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. వైస్ కెప్టెన్ అయినా జితేష్ శ‌ర్మ‌ను కాద‌ని సామ్ క‌ర‌ణ్‌ను కెప్టెన్‌గా పంజాబ్ మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంపై నెటిజ‌న్లు ఫైర్ అవుతోన్నారు.

జితేష్ శ‌ర్మ‌
జితేష్ శ‌ర్మ‌

IPL 2024: సాధార‌ణంగా క్రికెట్‌లో అనివార్య కార‌ణాల వ‌ల్ల కెప్టెన్ మ్యాచ్ నుంచి త‌ప్పుకున్నా, ఆడ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్న‌ అత‌డి స్థానంలో వైస్ కెప్టెన్ సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌డ‌తాడు. కెప్టెన్‌, వైస్ కెప్టెన్ అందుబాటులో లేని ప‌క్షంలో జ‌ట్టులోని మ‌రో క్రికెట‌ర్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తుంటారు.

పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌...

కానీ శ‌నివారం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌కు శిఖ‌ర్ ధావ‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. భుజం గాయం కార‌ణంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ దూర‌మ‌య్యాడు.పంజాబ్ జ‌ట్టుకు జితేష్ శ‌ర్మ‌ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. వైస్ కెప్టెన్ హోదాలో ఫొటోషూట్‌ల‌కు జితేన్ హాజ‌ర‌య్యాడు. రూల్స్ ప్ర‌కారం ధావ‌న్ దూర‌మైతే జితేష్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాల్సింది.

గాయంతో ధావ‌న్ దూరం...

కానీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ధావ‌న్ గాయంతో త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో కెప్టెన్‌గా సామ్ క‌ర‌ణ్ ను జ‌ట్టు మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది జితేన్‌ను కాద‌ని సామ్ క‌ర‌ణ్‌కు కెప్టెన్సీ అప్ప‌గించ‌డంపై నెటిజ‌న్లు ఫైర్ అవుతోన్నారు. పంజాబ్ జ‌ట్టును సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జితేష్ శ‌ర్మ‌ ఫొటోషూట్‌ల‌కు మాత్ర‌మే వైస్ కెప్టెన్‌గా ప‌రిమిత‌మా? సామ్ క‌ర‌ణ్ కంటే జితేన్ ఎందులో త‌క్కువ అంటూ పంజాబ్ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ గొడ‌వ‌పై పంజాబ్ కోచ్ సంజ‌య్ బంగ‌ర్ క్లారిటీ ఇచ్చాడు. జితేష్ శ‌ర్మ‌ను తాము వైస్ కెప్టెన్‌గా ఎప్పుడు ప్ర‌క‌టించ‌లేద‌ని అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ప‌ర్వాలేద‌నిపించిన సామ్ క‌ర‌ణ్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. జితేష్ శ‌ర్మ‌ మాత్రం 29 ప‌రుగుల‌తో పంజాబ్ జ‌ట్టులో సెకండ్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ర‌షీద్ ఖాన్ వైస్ కెప్టెన్‌...

ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టీమ్‌లో ఇలాగే జ‌రిగింది. హార్దిక్ పాండ్య ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు సీజ‌న్స్‌లో గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు ర‌షీద్ ఖాన్ వైఎస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సీజ‌న్‌లో కూడా అత‌డికే ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. పాండ్య జ‌ట్టును వీడ‌టంతో వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ర‌షీద్‌ఖాన్‌ను కాద‌ని జ‌ట్టు ప‌గ్గాల‌ను శుభ్‌మ‌న్ గిల్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అప్ప‌గించింది.

భువ‌నేశ్వ‌ర్‌కు అన్యాయం...

స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌లో ఇలాగే జ‌రిగింది. స‌న్‌రైజ‌ర్స్‌కు చాలా కాలంగా వైఎస్ కెప్టెన్‌గా కొన‌సాగుతోన్నాడు సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌. కొన్ని మ్యాచ్‌ల‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. గ‌త సీజ‌న్‌లో అత‌డు వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోండ‌గానే అత‌డిని కాద‌ని మార్‌క్ర‌మ్‌ను సార‌థిగా టీమ్ మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించింది.

Whats_app_banner