Hardik Pandya: హార్దిక్ పాండ్యాను నిండా ముంచిన సవతి సోదరుడు.. కోట్లు నష్టపోయిన స్టార్ క్రికెటర్
Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను అతని సవతి సోదరుడు నిండా ముంచాడు. హార్దిక్ తోపాటు అతని అన్న కృనాల్ పాండ్యా కూడా నష్టపోయాడు.
Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బ్రదర్స్ ను వాళ్ల సవతి సోదరుడు వైభవ్ పాండ్యా మోసం చేసిన కేసు ఇప్పుడు సంచలనం రేపుతోంది. వాళ్ల వ్యాపార భాగస్వామిగా ఉన్న వైభవ్.. సుమారు రూ.4.3 కోట్లు మోసం చేసినట్లు కేసు నమోదు కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్లేయర్స్ ఐపీఎల్ 2024లో ఆడుతున్న విషయం తెలిసిందే.
పాండ్యా బ్రదర్స్‌కు కుచ్చుటోపీ
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. పాండ్యా బ్రదర్స్ సవతి సోదరుడు అయిన వైభవ్ వాళ్లకు చెందిన ఓ భాగస్వామ్య సంస్థ నుంచి ఏకంగా రూ.4.3 కోట్లు దారి మళ్లించాడు. దీంతో హార్దిక్, కృనాల్ తీవ్రంగా నష్టపోయారు. నిధులను పక్కదారి పట్టించడంతోపాటు భాగస్వామ్య ఒప్పందాలను ఉల్లంఘించాడంటూ అతనిపై కేసు నమోదు చేశారు.
మూడేళ్ల కిందట హార్దిక్, కృనాల్, వైభవ్ కలిసి ఓ పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీళ్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు హార్దిక్, కృనాల్ చెరో 40 శాతం పెట్టుబడి పెట్టారు. ఇక వైభవ్ 20 శాతం పెట్టుబడితోపాటు రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం ప్రారంభించాడు. లాభాలను మూడు భాగాలుగా షేర్ చేసుకోవాలని వీళ్ల ఒప్పందంలో ఉంది.
మోసం ఇలా జరిగింది
కానీ వైభవ్ మాత్రం పాండ్యా బ్రదర్స్ కు తెలియకుండా అదే వ్యాపారం చేస్తున్న మరో సంస్థను ఏర్పాటు చేశాడు. తన సవతి సోదరులకు ఈ విషయం చెప్పకుండానే అతడు ఈ పని చేశాడు. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అంతేకాకుండా వీళ్ల సంస్థ లాభాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇవి సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేశారు.
ఇక వీళ్ల సంస్థలోనే పాండ్యా బ్రదర్స్ కు తెలియకుండా వైభవ్ తన లాభాల వాటాను 20 నుంచి 33.3 శాతానికి పెంచుకున్నాడు. దీనివల్ల కూడా హార్దిక్, కృనాల్ నష్టపోయారు. ఈ మోసాలకు పాల్పడిన వైభవ్ పై ముంబై పోలీసులోని చెందిన ఆర్థిక నేరాల విభాగం మోసం, ఫోర్జరీ కేసులు పెట్టింది. అయితే దీనిపై ఇప్పటి వరకూ పాండ్యా బ్రదర్స్ నుంచి ఎలాంటి కామెంట్స్ రాలేదు.
ఐపీఎల్‌తో పాండ్యా బ్రదర్స్ బిజీ
ప్రస్తుతం పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ ఐపీఎల్ 2024లో ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ లో కృనాల్ కీలకమైన ఆల్ రౌండర్ గా ఉన్నాడు. గతేడాది వరల్డ్ కప్ లో గాయపడినప్పటి నుంచీ టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ కు ఈ సీజన్ ఐపీఎల్ కూడా ఏమీ కలిసి రావడం లేదు.
అతని కెప్టెన్సీలో ముంబై 4 మ్యాచ్ లలో ఒకటే గెలిచింది. దీనికితోడు సొంత అభిమానుల నుంచీ హేళన తప్పడం లేదు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తమ సవతి సోదరుడే ఇలా మోసం చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 11) ఆర్సీబీతో ముంబై ఇండియన్స్ కీలకమైన మ్యాచ్ ఆడనుంది.