LSG vs GT: లక్నో హ్యాట్రిక్ గెలుపు.. యశ్, కృనాల్ బౌలింగ్ మ్యాజిక్.. బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్.. గుజరాత్ ఢమాల్
LSG vs GT IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ జోష్ కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ గెలుపుతో సత్తాచాటింది. యశ్ ఠాకూర్, కృనాల్ పాండ్యా అద్భుత బౌలింగ్ చేశారు.

LSG vs GT: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‍ఎస్‍జీ) మరోసారి అదరగొట్టింది. నేడు (ఏప్రిల్ 7) గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ విక్టరీ సాధించింది. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. లక్నో వేదికగా ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో ఎల్‍ఎస్‍జీ 33 పరుగుల తేడాతో గుజరాత్‍పై ఘన విజయం సాధించింది. ఆల్‍రౌండ్ షోతో రాహుల్ సేన రాణించింది. ఐపీఎల్‍లో గుజరాత్‍పై లక్నోకు ఇదే తొలి గెలుపు.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగుల మోస్తరు స్కోరు చేసింది. మార్కస్ స్టొయినిస్ (43 బంతుల్లో 58 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శకతంతో అదరగొట్టగా.. నికోలస్ పూరన్ (22 బంతుల్లో 32 రన్స్ నాటౌట్; 3 సిక్స్‌లు), ఆయుష్ బదోనీ (11 బంతుల్లో 20 పరుగులు) చివర్లో వేగంగా ఆడారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 33 పరుగులు) దూకుడుగా ఆడలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో దర్శన్ నాల్కండే, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు తీశారు.
లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ జట్టు పూర్తిగా విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోతూ చతికిలపడింది. లక్నో స్పిన్నర్ కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. పేసర్ యశ్ ఠాకూర్ (5/30) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. వీరి విజృంభణతో 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై గుజరాత్ పరాజయం పాలైంది. కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (19) విఫలమవగా.. సాయి సుదర్శన్ (33) పర్వాలేదనిపించాడు. చివర్లో రాహుల్ తెవాతియా (30) మినహా మిలిగిన గుజరాత్ బ్యాటర్లందరూ ఫెయిల్ అయ్యారు. దీంతో ఆ జట్టు మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.
కృనాల్, యశ్ కమాల్
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా.. ఈ మ్యాచ్‍లో స్పిన్ మ్యాజిక్ చూపాడు. సాయి సుదర్శన్ (31), బీఆర్ శరత్ (2), దర్శన్ నాల్కండే (12) వికెట్లు తీసి గుజరాత్‍ను దెబ్బకొట్టాడు. ముఖ్యంగా కీలక సమయంలో జీటీ బ్యాటర్లను కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి.. గుజరాత్‍ను అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‍లో నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు కృనాల్.
లక్నో పేసర్ యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్
ఈ మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఓ అద్భుత క్యాచ్ పట్టాడు. తన బౌలింగ్‍లో తనకే వేగంగా వచ్చిన క్యాచ్‍ను అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. 8వ ఓవర్లో గుజరాత్ బ్యాటర్ కేన్ విలియమన్స్.. తన వైపు బంతిని కొట్టగా రనప్‍లోనే డైవ్ చేసి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు బిష్ణోయ్. కీలక వికెట్ తీశాడు.
ఈ సీజన్‍లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరు పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఐదు మ్యాచ్‍ల్లో మూడు ఓడిన గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానానికి పడిపోయింది.