తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pat Cummins: ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ధోనీని సమం చేయనున్న కమిన్స్.. ఆ అరుదైన రికార్డు ఏదో తెలుసా?

Pat Cummins: ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ధోనీని సమం చేయనున్న కమిన్స్.. ఆ అరుదైన రికార్డు ఏదో తెలుసా?

Hari Prasad S HT Telugu

26 May 2024, 11:50 IST

google News
  • Pat Cummins: ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ప్యాట్ కమిన్స్ గెలిపించాడంటే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ఈసారి ది గ్రేట్ ఎమ్మెస్ ధోనీ సరసన అతడు నిలుస్తాడు.

ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ధోనీని సమం చేయనున్న కమిన్స్.. ఆ అరుదైన రికార్డు ఏదో తెలుసా?
ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ధోనీని సమం చేయనున్న కమిన్స్.. ఆ అరుదైన రికార్డు ఏదో తెలుసా? (PTI)

ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ధోనీని సమం చేయనున్న కమిన్స్.. ఆ అరుదైన రికార్డు ఏదో తెలుసా?

Pat Cummins: ప్యాట్ కమిన్స్ ను వేలంలో రూ.20.5 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసినప్పుడు కొందరు నవ్వారు. కొందరు హేళన చేశారు. కొందరు పెదవి విరిచారు. కానీ తనకు ఆ ధర సరైనదే అని అతడు నిరూపించాడు. ఓ వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ గా తన స్థాయికి తగినట్లు రాణించకపోయినా.. కెప్టెన్ గా ఆస్ట్రేలియాలాగే సన్ రైజర్స్ నూ నడిపించాడు. ఇప్పుడు ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.

ప్యాట్ కమిన్స్ మిడాస్ టచ్

మిడాస్ టచ్ తెలుసు కదా. ఏది ముట్టుకున్నా.. అది బంగారమైపోతుంది. ప్యాట్ కమిన్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆస్ట్రేలియా ఎప్పుడైతే అతనికి కెప్టెన్సీ అప్పగించిందో అతని విజయ పరంపర కొనసాగింది. తొలి కెప్టెన్ గానే అతడు ఆస్ట్రేలియాకు యాషెస్ అందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా చేశాడు. వన్డే వరల్డ్ కప్ సాధించిపెట్టాడు.

ఇక ఇప్పుడు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా అతని మిడాస్ టచ్ కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి ఆ టీమ్ నిలకడగా రాణించింది. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డిలాంటి ప్లేయర్స్ వల్ల ఇప్పుడా టీమ్ ఫైనల్ చేరింది. మూడోసారి ఫైనల్ చేరి.. రెండో ట్రోఫీపై కన్నేసింది. ఆదివారం (మే 26) కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఈ ఫైనల్లో తలపడనుంది.

ధోనీ రికార్డును సమం చేస్తాడా?

ప్యాట్ కమిన్స్ ఇప్పుడు టీమిండియా లెజెండ్ ధోనీ రికార్డును సమం చేయడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ గెలిస్తే.. ఒకే సీజన్లో వన్డే వరల్డ్ కప్, ఐపీఎల్ గెలిచిన రెండో కెప్టెన్ గా కమిన్స్ నిలుస్తాడు. గతంలో ధోనీ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. 2011లో ఐపీఎల్ ట్రోఫీతోపాటు ఇండియాకు వరల్డ్ కప్ కూడా అందించాడు ధోనీ. నిజానికి ఇండియా ఏ ఫార్మాట్లో అయినా ఓ వరల్డ్ కప్ గెలిచింది అప్పుడే. తర్వాత గతేడాది ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లోనే ఓడింది.

ఇప్పుడు కమిన్స్ ఆ అరుదైన రికార్డుకు ఒక్క విజయం దూరంలోనే ఉన్నాడు. ఇప్పటికే 2016లో వార్నర్ కెప్టెన్సీలో ఒకసారి సన్ రైజర్స్ ట్రోఫీ గెలిచింది. 2018లో ఫైనల్ చేరినా ఓడిపోయింది. ఇప్పుడు మూడోసారి ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ చేరింది. 2023 చివర్లో ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ సాధించి పెట్టిన కమిన్స్.. ఇప్పుడు సన్ రైజర్స్ కు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తే ధోనీని సమం చేస్తాడు.

ధోనీ 2010, 2011, 2018, 2021, 2023లలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. ఇక 2014లో నైట్ రైడర్స్ తరఫున ప్లేయర్ గా కమిన్స్ ఒకసారి ట్రోఫీ అందుకున్నాడు. మరి ఈసారి కెప్టెన్ గా ఏం చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. తొలిసారి కెప్టెన్ గా ఆస్ట్రేలియాకు మరుపురాని విజయాలు అందించిన కమిన్స్.. సన్ రైజర్స్ తోనూ అదే రిపీట్ చేయగలడో లేదో చూడాలి.

తదుపరి వ్యాసం