KKR vs SRH IPL 2024 final: సన్ రైజర్స్, కేకేఆర్ ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే ఏం చేస్తారు? ట్రోఫీ ఎవరికి?
KKR vs SRH IPL 2024 final: సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటి? ట్రోఫీ ఎవరికి ఇస్తారు? ప్రస్తుతం చెన్నైలో వాతావరణం ఎలా ఉందో ఇక్కడ చూడండి.
KKR vs SRH IPL 2024 final: ఐపీఎల్ 2024లో ఇప్పటికే కొన్ని మ్యాచ్ లు వర్షం వల్ల ప్రభావితమయ్యాయి. కొన్ని పూర్తిగా రద్దవగా.. కొన్ని ఓవర్లు కుదించి జరిగాయి. ఇప్పుడు ఫైనల్ కు కూడా వర్షం వల్ల ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఈ ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే శనివారం (మే 25) సడెన్ గా కురిసిన వర్షం వల్ల కేకేఆర్ ప్రాక్టీస్ రద్దు చేశారు. మరి ఫైనల్ కు వర్షం పడితే ఎలా?
ఫైనల్‌కు వాతావారణం ఎలా ఉందంటే?
ఇప్పటికే ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 కూడా చెన్నైలోనే జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయింది. ఇక ఫైనల్ జరిగే ఆదివారం (మే 26) వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఆకాశం మాత్రం మేఘవృతమై ఉండనుంది. అక్యూవెదర్ ప్రకారం.. మ్యాచ్ రోజు 97 శాతం ఆకాశం మేఘావృతంగా ఉండనుంది.
కేవలం ఒక శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉంది. అంటే దాదాపుగా లేనట్లే. అయితే హఠాత్తుగా వర్షం కురిసే ఛాన్స్ మాత్రం కొట్టి పారేయలేం. శనివారం కేకేఆర్ ప్రాక్టీస్ సందర్భంగా ఇదే జరిగింది. సాయంత్రం లైట్ల కింద ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ఫుట్‌బాల్ ఆడుతూ ప్లేయర్స్ వామప్ మొదలు పెట్టగానే వర్షం ప్రారంభమైంది.
దీంతో ప్లేయర్స్ ఇండోర్స్ లోకి వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అటు చెపాక్ గ్రౌండ్ సిబ్బంది ఫైనల్ కు ఉపయోగించే పిచ్ ను పూర్తిగా కప్పి ఉంచారు. ఈ పిచ్ తయారీలో ఎక్కువగా ఎర్ర మట్టి ఉపయోగించారు. దీంతో ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. రెండో క్వాలిఫయర్ కు వాడిన పిచ్ కంటే కూడా ఈ పిచ్ పై ఎక్కువ పరుగులు రానున్నాయి.
వర్షం పడితే ఎలా?
ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి. చెన్నైపైనా దీని ప్రభావం కొంత ఉంది. ఒకవేళ వర్షం పడి ఆదివారం (మే 26) మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే ఉంటుంది. గతేడాది కూడా అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ కు వర్షం అడ్డుపడటంతో మరుసటి రోజు మ్యాచ్ నిర్వహించారు.
ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ లో కేకేఆర్ ఫస్ట్ ప్లేస్, సన్ రైజర్స్ రెండో స్థానంలో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఫైనల్ రెండు రోజులూ సాధ్యం కాకపోతే టాప్ ప్లేస్ లో నిలిచిన కేకేఆర్ ట్రోఫీ ఎగరేసుకుపోతుంది.
ఈ రెండు టీమ్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడ్డాయి. అందులో కేకేఆర్ గెలిచి నేరుగా ఫైనల్ కు వచ్చింది. సన్ రైజర్స్ రెండో క్వాలిఫయర్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది. అయితే సన్ రైజర్స్ పై కేకేఆర్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వేళ ఫైనల్లోనూ ఆ జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోందనడంలో సందేహం లేదు.