తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్‌ పరువు తీసిన ఆర్సీబీ ట్వీట్.. అందరికీ అది సాధ్యం కాదంటూ..

Pakistan Cricket: పాకిస్థాన్ టీమ్‌ పరువు తీసిన ఆర్సీబీ ట్వీట్.. అందరికీ అది సాధ్యం కాదంటూ..

Hari Prasad S HT Telugu

04 September 2024, 10:03 IST

google News
    • Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరువు తీసింది ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ. బంగ్లాదేశ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ అయిన పాక్ టీమ్ పేరును ప్రస్తావించకుండానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఓ ట్వీట్ చేసింది.
పాకిస్థాన్ టీమ్‌ పరువు తీసిన ఆర్సీబీ ట్వీట్.. అందరికీ అది సాధ్యం కాదంటూ..
పాకిస్థాన్ టీమ్‌ పరువు తీసిన ఆర్సీబీ ట్వీట్.. అందరికీ అది సాధ్యం కాదంటూ..

పాకిస్థాన్ టీమ్‌ పరువు తీసిన ఆర్సీబీ ట్వీట్.. అందరికీ అది సాధ్యం కాదంటూ..

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మరింత లోతుల్లోకి శరవేగంగా వెళ్లిపోతోంది. తాజాగా బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో ఓడిన ఆ టీమ్ పై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీమిండియా ఫొటోతో ఆర్సీబీ చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇది పాక్ టీమ్ పరువు తీసేలా ఉంది.

ఆర్సీబీ ట్వీట్ వైరల్

ఐపీఎల్ ఫ్రాంఛైజీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. బంగ్లాదేశ్ చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 3) ఓ ట్వీట్ చేసింది. తొలిసారి బంగ్లా చేతుల్లో 0-2తో పాక్ ఓడిపోయింది. దీంతో టీమిండియా ఫొటో పెట్టి పరోక్షంగా పాకిస్థాన్ కు ఆర్సీబీ పంచ్ వేసింది.

"ఈ టీమ్ లాగా స్వదేశంలో గెలవడం అంత సులువు కాదు. ఈ నెలలో వాళ్లు తిరిగి వస్తున్నారు" అంటూ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫొటోను ఆర్సీబీ పోస్ట్ చేసింది. పాకిస్థాన్ ను ఓడించిన అదే బంగ్లాదేశ్ తో ఇండియన్ టీమ్ ఈ నెలలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.

మూడున్నరేళ్లుగా ఇంతే..

ఇండియన్ టీమ్ ను స్వదేశంలో ఓడించడం దాదాపు అసాధ్యమనే భావన క్రికెట్ ప్రపంచంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఆ టీమ్ ఫిబ్రవరి, 2021 తర్వాత ఇప్పటి వరకూ స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. చివరిసారి అప్పుడే సౌతాఫ్రికాను పాక్ వైట్ వాష్ చేసింది.

తర్వాత వరుసగా 10 మ్యాచ్ లు ఆడినా ఒక్కదాంట్లోనూ గెలవలేకపోయింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ పై కన్నేసిన పాకిస్థాన్ స్వదేశంలో బంగ్లాదేశ్ చేతుల్లో ఓటమితో ఆ అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.

ఇండియా రికార్డు ఇలా..

పాకిస్థాన్ టీమ్ కు పూర్తి భిన్నంగా టీమిండియా రికార్డు ఉంది. స్వదేశంలో 2012 తర్వాత ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోలేదు. చివరిసారి ఇంగ్లండ్ చేతుల్లో మన టీమ్ ఓడిపోయింది. ఈ 12 ఏళ్లలో వరుసగా 17 టెస్టు సిరీస్ లను గెలుస్తూ వచ్చింది. ఇది వరల్డ్ రికార్డు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా స్వదేశంలో 1994-2000 మధ్య, 2004-2008 మధ్య వరుసగా పది సిరీస్ లు గెలిచింది.

2012లో చివరిసారి స్వదేశంలో సిరీస్ కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఇండియా 50 టెస్టులు ఆడి 39 గెలిచి, కేవలం నాలిగింట్లో ఓడిపోయింది. అందులో రెండు ఆస్ట్రేలియా, మరో రెండు ఇంగ్లండ్ చేతుల్లో కావడం గమనార్హం. ఇక ఇప్పుడు పాకిస్థాన్ ను మట్టి కరిపించి వస్తున్న బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ లో న్యూజిలాండ్ తో మరో మూడు టెస్టుల సిరీస్ కూడా ఉంది.

తదుపరి వ్యాసం