Team India: పాకిస్థాన్ గడ్డపైకి టీమిండియా వెళ్లకపోవడమే మంచిది.. ప్లేయర్స్‌కి సెక్యూరిటీ ముఖ్యమన్న హర్భజన్
Champions Trophy 2025: పాకిస్థాన్ చాలా రోజుల తర్వాత ఒక మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. వచ్చే ఏడాది దాయాది దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కానీ భారత్ జట్టు మాత్రం అక్కడికి వెళ్లి ట్రోఫీ ఆడేందుకు ఇష్టపడటం లేదు.
పాకిస్థాన్ గడ్డపైకి వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత్ జట్టు వెళ్లకపోవడమే మంచిదని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. గత 16 ఏళ్లు నుంచి దాయాది దేశంలో టీమిండియా అడుగుపెట్టని విషయం తెలిసిందే.
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ, దౌత్య విభేదాల కారణంగా వచ్చే ఏడాది కూడా పర్యటించడం సందేహంగానే ఉంది. షెడ్యూల్ ప్రకారం పాక్ గడ్డపై ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.
ఒకవేళ భారత్ జట్టు పాక్ గడ్డపైకి వెళ్లేందుకు ఇష్టపడకపోతే ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ లేదా శ్రీలంక లాంటి తటస్థ వేదికల్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. 2008 నుంచి భద్రతా కారణాలరీత్యా టీమిండియా పాకిస్థాన్ వెళ్లడం లేదు. తాజాగా ఇదే వాదనతో ఏకీభవించిన హర్భజన్ సింగ్.. ప్లేయర్లకి భద్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు.
కానీ పాకిస్థాన్ మాత్రం వచ్చే ఏడాది భారత్ జట్టు తమ దేశానికి వచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. తొలుత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పావులు కదిపింది. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రియాక్ట్ కాకపోవడంతో ఇప్పుడు పీసీబీ, పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బెదిరింపులకి దిగుతున్నారు.
భద్రత చాలా ముఖ్యం
‘‘పాకిస్థాన్ వాళ్లకి వాళ్లు చెప్పేది కరెక్ట్‌గానే అనిపించొచ్చు. కానీ మనం మన కోణంలో భద్రత గురించి ఆలోచిస్తున్నాం. ఆటగాళ్ల భద్రతకు పాకిస్థాన్ భరోసా ఇవ్వకపోతే.. భారత్ జట్టు అక్కడికి వెళ్లాలని నేను కోరుకోవట్లేదు. జట్లకు పూర్తి భద్రత కల్పిస్తామని, ట్రోఫీ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు భరోసా ఇవ్వాలి. అంతిమంగా క్రికెట్ గురించే కాకుండా చాలా అంశాల గురించి ఆలోచించి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక క్రికెటర్‌గా క్రికెట్ గురించి మాత్రమే నేను చెప్పలగను’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
భారత్ జట్టు చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు మాత్రం ఐసీసీ ఈవెంట్స్, ఆసియా కప్‌లో ఆడేందుకు భారత్‌కి వస్తూనే ఉంది. చివరిగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ కోసం భారత్ గడ్డపైకి వచ్చింది. ఈ రెండు దాయాలు దేశాలు చివరిగా తలపడింది ఈ మెగా టోర్నీలోనే.
ఐసీసీ వద్ద ప్లాన్-బి
భారత్ జట్టు ఒకవేళ పాక్ పర్యటనకు వెళ్లకపోతే ఐసీసీ వద్ద ప్లాన్- బి ఉంది. పాకిస్థాన్ గడ్డపై కాకుండా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సి వస్తే.. ఆ మ్యాచ్‌ల నిర్వహణకి అయ్యే ఖర్చు కోసం ఐసీసీ దాదాపు 65 మిలియన్ డాలర్లను కేటాయించింది.
ఐసీసీ ఛైర్మన్‌గా బీసీసీఐ ప్రస్తుత సెక్రటరీ జైషా ఈ ఏడాది చివర్లో బాధ్యతలు చేపట్టనున్నాడు. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆటలు ఇక సాగకపోవచ్చు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లను భారత్ జట్టు తటస్థ వేదికలపైనే ఆడే అవకాశం ఉంది. కానీ పీసీబీ మాత్రం చివరి వరకూ బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా భారత్ జట్టుని పాక్ గడ్డపైకి పిలిపించుకోవాలని పట్టుదలతో ఉంది.