Pakistan Cricket: స్టేడియం పేరు మార్చినందుకు రూ.100 కోట్లు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం-pakistan cricket board to get 100 crores to rename gaddafi stadium in lahore ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Cricket: స్టేడియం పేరు మార్చినందుకు రూ.100 కోట్లు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం

Pakistan Cricket: స్టేడియం పేరు మార్చినందుకు రూ.100 కోట్లు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం

Hari Prasad S HT Telugu
Aug 30, 2024 09:49 PM IST

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురవనుంది. కేవలం ఓ స్టేడియం పేరు మార్చడం కోసం అక్కడి బోర్డుకు ఏకంగా 100 కోట్ల పాకిస్థానీ రూపాయలు రానుండటం గమనార్హం. ఇప్పటికే అలా ఓ స్టేడియం పేరు మార్చి డబ్బు సంపాదించిన ఆ బోర్డు.. ఇప్పుడు మరో స్టేడియం పేరు మార్చబోతోంది.

స్టేడియం పేరు మార్చినందుకు రూ.100 కోట్లు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం
స్టేడియం పేరు మార్చినందుకు రూ.100 కోట్లు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం (AP)

Pakistan Cricket: పాకిస్థాన్ పరిస్థితే కాదు.. అక్కడి క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. దీనికితోడు ఆ టీమ్ ఆటతీరు కూడా రోజు రోజుకూ దిగజారుతోంది. దీంతో డబ్బు కోసం పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఎత్తులు వేస్తోంది. తాజాగా లాహోర్ లోని గడాఫీ స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనికోసం ఆ బోర్డుకు భారీగానే సొమ్ము ముట్టనుంది.

గడాఫీ స్టేడియం పేరు మార్పు

పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న గడాఫీ స్టేడియం పేరు మార్చాలని పాక్ క్రికెట్ బోర్డు చూస్తోంది. లిబియా మాజీ అధినేత మువమ్మర్ గడాఫీ పేరు మీదుగా 1974లో ఈ స్టేడియం నిర్మించారు. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఆ స్టేడియం పేరు మార్చడానికి ఓ ప్రైవేట్ బ్యాంకుతో పాక్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది.

అంటే ఇక నుంచి గడాఫీ స్టేడియం స్థానంలో సదరు ప్రైవేటు బ్యాంకు పేరుతో స్టేడియాన్ని పిలుస్తారు. దీనికోసం పాక్ బోర్డుకు ఏకంగా 100 కోట్ల పాకిస్థానీ రూపాయలు రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను పాక్ బోర్డు త్వరలోనే చేయనుంది.

ఆ స్టేడియంలాగే..

నిజానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇలా స్టేడియాల పేరు మార్చడం ద్వారా డబ్బులు సంపాదించడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కరాచీలో క్రికెట్ స్టేడియం పేరును నేషనల్ స్టేడియంగా మార్చారు. ఇందుకోసం పాక్ బోర్డుకు అప్పట్లో 45 కోట్ల డాలర్లు లభించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

ఇప్పుడు లాహోర్ లోని గడాఫీ స్టేడియం పేరును కూడా ప్రైవేటు బ్యాంక్ పేరు మీదికి మార్చడానికి 100 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. 2021లో అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ఇలా స్టేడియాల పేరు మార్పు ద్వారా డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. కరాచీ స్టేడియం డీల్ అతని హయాంలోనే జరిగింది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే..

కరాచీలోని నేషనల్ స్టేడియం పేరును నేషనల్ బ్యాంక్ క్రికెట్ అరెనాగా మార్చారు. ప్రస్తుతం అక్కడి మంత్రి మోసిన్ నఖ్వి నేతృత్వంలో కొనసాగుతున్న పాక్ బోర్డు లాహోర్ స్టేడియం పేరు మార్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

వచ్చే ఏడాది పాకిస్థాన్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం మూడు స్టేడియాలను రెనోవేట్ చేయాలని నిర్ణయించారు. అందుకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని ఇలా స్టేడియం పేరు మార్చడం ద్వారా పొందాలని పాక్ బోర్డు భావిస్తోంది.

Whats_app_banner