ENG vs PAK: పరువు నిలుపుకున్న ఇంగ్లండ్.. పాక్‍పై భారీ గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై
ENG vs PAK - Cricket World Cup 2023: ప్రపంచకప్‍లో తన పోరాటాన్ని ఇంగ్లండ్ గెలుపుతో ముగించింది. పాకిస్థాన్‍పై ఇంగ్లిష్ జట్టు గెలిచింది. రెండు జట్లు కూడా సెమీస్‍కు అర్హత సాధించలేకపోయాయి.
ENG vs PAK - Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కాస్త పరువు నిలబెట్టుకుంది. సెమీస్‍కు అర్హత సాధించలేకపోయినా.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై ఇంగ్లిష్ జట్టు గెలిచింది. పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్‍లో భాగంగా కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‍లో ఇంగ్లండ్ 93 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‍పై గెలిచింది. ఈ విజయంతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది ఇంగ్లండ్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించి పరువు కాపాడుకుంది ఇంగ్లిష్ జట్టు.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (84 పరుగులు), జో రూట్ (60), జానీ బెయిర్ స్టో (59) అర్ధ శతకాలతో అదరగొట్టారు. పాకిస్థాన్ బౌలర్లలో హరిస్ రవూఫ్ మూడు, షహిన్ షా అఫ్రిది, మహమ్మద్ వాసిమ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
భారీ లక్ష్యఛేదనలో పాకిస్థాన్ ఆది నుంచే తడబడింది. 43.3 ఓవర్లలో 244 పరుగులకు పాక్ ఆలౌటైంది. అఘ సల్మాన్ (51) అర్ధ శకతం చేయగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (38), మహమ్మద్ రిజ్వాన్ (36) మోస్తరుగా ఆడారు. చివర్లో హరిస్ రవూఫ్ (35) రాణించడంతో పాకిస్థాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్, గస్ అట్కిన్‍సన్, మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్ పోరును 6 పాయింట్లతో ఇంగ్లండ్ ముగించింది. డిఫెండింగ్ చాంపియన్‍గా టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లిష్ జట్టు 9 మ్యాచ్‍ల్లో మూడింట గెలిచి.. పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. సెమీస్‍కు చేరకున్నా కనీసం ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయి పరువు కాపాడుకుంది. ఇక పాకిస్థాన్ 9 మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.