Harbhajan Singh: ఎవరినీ కించపరచాలని అనుకోలేదు: క్షమాపణ చెప్పిన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్
Harbhajan Singh - Tauba Tauba Controversy: వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్‍ను భారత టీమ్ ఇటీవలే దక్కించుకుంది. ఈ సంబరాల్లో భాగంగా కెప్టెన్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ఓ వీడియో చేశారు. అయితే దీనిపై విమర్శలు తీవ్రంగా రావటంతో హర్భజన్ క్షమాణపలు చెప్పారు.
వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు విజేతగా నిలిచింది. బర్మింగ్‍హామ్ వేదికదా జరిగిన ఫైనల్‍లో పాకిస్థాన్‍పై చివరి ఓవర్లో గెలిచి టైటిల్ సాధించింది భారత్. దీంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇండియా చాంపియన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్, ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ఓ వీడియో చేశారు. అయితే, అందులో వారు కుంటుతూ ఉండడం వివాదానికి దారి తీసింది.
విమర్శలు ఇందుకే..
బాలీవుడ్ పాట ‘తౌబా తౌబా’కు యువరాజ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా రీల్ చేశారు. అయితే వారు ముగ్గురు కుంటుతున్నట్టుగా ఈ వీడియోలో యాక్ట్ చేశారు. దీంతో దివ్యాంగులను వారు కించపరిచారంటూ విమర్శలు వస్తున్నాయి.
పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మానసి జోషి ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “స్టార్స్ అయిన మీరు మరింత బాధ్యతగా ఉండాలి. దివ్యాంగులైన వారి నడకను దయచేసి అవహేళన చేయకండి. ఇది సరదాగా లేదు” అని మానసి పోస్ట్ చేశారు. హాస్యం కోసం దివ్యాంగులు నడిచే విధానాన్ని వెక్కించడాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఈ వీడియో ఉందంటూ విమర్శించారు. ఈ వీడియో చేయడం వల్ల దివ్యాంగులను మరికొందరు హేళన చేసే అవకాశం ఉంటుందని ఆమె సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు కూడా విమర్శలు చేశారు. దీంతో హర్భజన్ సింగ్ స్పందించారు. వీడియో డిలీట్ చేయటంతో పాటు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో నోట్ పోస్ట్ చేశారు.
మా ఉద్దేశం అది కాదు
15 రోజులు నిరంతరంగా క్రికెట్ ఆడిన తర్వాత తమ శరీరాలు ఎలా అయ్యాయో సూచనప్రాయంగా చెప్పేందుకు తాము అలా చేశామని తౌబా తౌబా వీడియోపై హర్భజన్ సింగ్ స్పందించారు. ఎవరినీ కించపరచాలనేది తమ ఉద్దేశం కాదని ట్వీట్ చేశారు.
తాము ఎవరినీ కించపరచాలని అనుకోలేదని, ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. “ఇంగ్లండ్‍లో చాంపియన్‍షిప్ గెలిచాక మేం ఇక్కడ చేసిన తౌబా తౌబా వీడియో గురించి అభ్యంతరాలు తెలుపుతున్న వారికి స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. మేం ఎవరి మనోభావాలను కించపరచాలనుకోలేదు. మేం ప్రతీ వ్యక్తి, ప్రతీ కమ్యూనిటీని గౌరవిస్తాం. 15 రోజులు నిరంతరాయంగా క్రికెట్ ఆడాక మా శరీరాలు ఎలా అయ్యాయనే దాని గురించే ఈ వీడియో. మా శరీరాలు పులిసిపోయాయి. మేం ఎవరినీ కించపరచాలని, బాధ పెట్టాలని అనుకోలేదు. అయినా ఒకవేళ మేం తప్పు చేశామని ఎవరైనా భావిస్తే నా నుంచి నేను క్షమాపణ చెబుతున్నా. దీన్ని ఇక్కడితో ముగించేయండి. ముందుకు సాగండి. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి” అని హర్భజన్ సింగ్ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
పాకిస్థాన్ చాంపియన్స్ జట్టుతో జూలై 13న జరిగిన వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా చాంపియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని చివర్లో ఛేదించి ఉత్కంఠగా గెలిచింది. అంబటి రాయుడు (50) అర్ధ శకతంతో అదరగొట్టగా.. యూసుఫ్ పఠాన్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యువరాజ్ సింగ్ (15 నాటౌట్) చివరి వరకు నిలువగా.. ఇర్ఫాన్ పఠాన్ (5 నాటౌట్) విన్నింగ్ షాట్ కొట్టాడు. 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 రన్స్ చేసి గెలిచింది ఇండియా చాంపియన్స్.